అమెరికాలో శాశ్వత నివాస హక్కు కల్పించే గ్రీన్ కార్డ్ పొందడం ఇప్పుడు మరింత కఠినంగా మారింది. ముఖ్యంగా అమెరికన్ పౌరుడిని లేదా పౌరురాలిని వివాహం చేసుకున్న వారికి గతంలో సులభంగా గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి ఉండేది. అయితే, ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. ఇకపై కేవలం వివాహ ధ్రువపత్రాలు చూపిస్తే సరిపోదని, భార్యాభర్తలు నిజంగా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారనే స్పష్టమైన ఆధారాలు ఉంటేనే గ్రీన్ కార్డ్ దరఖాస్తులను పరిశీలిస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తేల్చిచెప్పారు. ఈ మార్పులు వేలాది మంది వలసదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ నిబంధనలపై ప్రముఖ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది బ్రాడ్ బెర్న్‌స్టెయిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “మీరు పెళ్లి చేసుకున్నారని చెప్పడం మాత్రమే సరిపోదు. నిజంగా కలిసి జీవిస్తున్నారో లేదో అధికారులు నిర్ధారించుకుంటారు” అని ఆయన తెలిపారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో భార్యాభర్తలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నట్లయితే, ఆ వివాహం కేవలం ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే చేసిందేమో అనే అనుమానంతో గ్రీన్ కార్డ్ దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. దీనివల్ల లాంగ్ డిస్టెన్స్ మ్యారేజెస్‌లో ఉన్న దంపతులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఇటీవలి కాలంలో అమెరికాలో చోటు చేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ల ప్రమేయం వెలుగులోకి రావడంతో ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంది. గతంలో ‘ఆందోళనకర దేశాలు’గా గుర్తించిన 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్ల వివరాలను సమగ్రంగా పునఃసమీక్షించాలని అధ్యక్షుడు ఆదేశించారు. అంతేకాదు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఇచ్చే పని అనుమతి గడువును కూడా 18 నెలలకు తగ్గించారు. ఇక ప్రతి ఏడాది 50 వేల మందికి అవకాశమిచ్చే డైవర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా నిలిపివేయడం గమనార్హం.
ఇకపై దంపతులు ఒకే చిరునామాలో నివసిస్తున్నారా? వారి మధ్య బంధం ఎంత నిజాయతీతో కూడుకున్నది? అనే అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తారు. అవసరమైతే ఇంటికే వచ్చి విచారణ చేసే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్లు, లీజ్ అగ్రిమెంట్లు, ఫోటోలు, కుటుంబ సంబంధాల ఆధారాలు వంటి ప్రతీ అంశాన్ని అధికారులు క్రాస్ చెక్ చేస్తారు. అందువల్ల విడిగా నివసిస్తున్న దంపతులు గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.