డా. బి.ఆర్. అంబేద్కర్ కొనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక చర్యలు చేపట్టింది. "కోనసీమ తిరుపతి"గా పేరుగాంచిన ఈ ఆలయానికి 17 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు అధికార నోటిఫికేషన్ ద్వారా వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అనివార్యమైందని శాఖ పేర్కొంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అందుబాటులో ఉన్న ఫారమ్‌ను ఉపయోగించి అనుసరించవలసిన విధానాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ ట్రస్ట్ బోర్డు ద్వారా ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, మరియు దేవస్థాన ఆదాయ వ్యయాల పారదర్శక నిర్వహణపై దృష్టి కేంద్రీకరించనున్నారు. భక్తులు, స్థానికులు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని దేవాదాయ శాఖ కోరుతోంది.