తిరుమలలో పర్యావరణ పరిరక్షణను బలపరిచే దిశగా టీటీడీ కొత్త చర్యలను చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు కొండపై రీసైక్లింగ్ మెషిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌లో PAC–05 యాత్రికుల వసతి సముదాయంలో ప్రయోగాత్మకంగా ఒక రీసైకిల్ డిపాజిట్ రీఫండ్ మెషిన్ ఏర్పాటు చేయగా, భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనితో ఈ యంత్రాల సంఖ్యను పెంచేందుకు టీటీడీ సిద్ధమైంది.
ఈ రీసైక్లింగ్ మిషన్ ద్వారా టెట్రాప్యాక్‌లు, కూల్‌డ్రింక్ టిన్నులు తాగిన తర్వాత భక్తులు వాటిని యంత్రంలో వేయగానే వారికి రూ.5 రీఫండ్ రూపంలో తిరిగి వస్తుంది. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం గణనీయంగా తగ్గడమే కాకుండా, తిరుమల పరిశుభ్రత కూడా మెరుగుపడుతోంది. యంత్రాల వినియోగంపై భక్తుల్లో మంచి అవగాహన ఏర్పడటంతో టీటీడీ మరిన్ని స్ట్రాటజిక్ లొకేషన్లలో మెషిన్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఈ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుమల వ్యాపారులు మరియు టెట్రాప్యాక్ డీలర్లు కూడా భక్తులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వచ్ఛ తిరుమల లక్ష్యంతో రీసైకిల్ మెషిన్ల వినియోగాన్ని ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో మరిన్ని మెషిన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో డీఎఫ్‌వో, డిప్యూటీ ఈవోలు, హెల్త్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు, రీసైకిల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో తిరుమలలో పరిశుభ్రత మరియు పర్యావరణ సంరక్షణపై టీటీడీ తీసుకుంటున్న చర్యలు మరింత వేగవంతం అవనున్నాయి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు వచ్చే సందర్భంలో ఈ చర్యలు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి. రమేష్ నాయుడు మరియు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కోరగా, టీటీడీ చైర్మన్ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని తెలిపారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం తరఫున తీర్థప్రసాదాలను అందజేశారు.