భారత అమెరికా వాణిజ్య చర్చలు మరో ముఖ్య దశలోకి ప్రవేశిస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు “సానుకూలంగా, మంచి పురోగతితో” ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. గత కొద్దికాలంగా ఐదు రౌండ్ల చర్చలు పూర్తయి, ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలపై మరింత స్పష్టమైన అవగాహనకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
గోయల్ మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందాలు కేవలం వేగంగా పూర్తి చేయడానికే కాదని, నిజమైన ప్రయోజనం ఇరు పక్షాలకు కలిగే విధంగా ఉండాలని చెప్పారు. “డెడ్‌లైన్‌లు పెట్టి చర్చలు జరిపితే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే నిర్ణయాలు సమయం తీసుకున్నా సరే, సంపూర్ణమైన అవగాహనతో రావాలిbఅని ఆయన వివరించారు.
అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రియర్ చేసిన వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు కూడా గోయల్ స్పష్టంగా స్పందించారు. అమెరికాకు ఇప్పటివరకు భారత్‌తో జరిగిన ‘అత్యుత్తమ’ వాణిజ్య ఒప్పందం ఇదేనంటూ గ్రియర్ చేసిన వ్యాఖ్యలు మీడియా ప్రచురించిన నేపథ్యంలో వారికి ఆ ఆనందం ఉంటే మంచిదే. నిజంగానే అంత సంతృప్తి ఉంటే వెంటనే ఒప్పందంపై సంతకం చేసేయాలి అని గోయల్ వ్యాఖ్యానించారు.
అమెరికా నుండి కొత్తగా నియమితుడైన డిప్యూటీ యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ భారత పర్యటనలో ఉన్నారని, ఇది చర్చల రౌండ్ కాదని, పరస్పర అవగాహన పెంచుకునే సందర్శన మాత్రమేనని గోయల్ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశాలు నిర్మాణాత్మకంగా సాగాయని, రెండు దేశాల అవసరాలను అర్థం చేసుకోవడంలో ఈ చర్చలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
ఇదే విషయంపై బుధవారం జరిగిన మరో కార్యక్రమంలో కూడా గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రవాసి దివస్ సందర్భంగా మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందాలలో అనేక కోణాలు ఉంటాయి. ఇప్పుడు వాటిలో చాలా అంశాలు స్పష్టమవుతున్నాయి. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలను గౌరవించే దిశగా చర్చలు సాగుతున్నాయి అని తెలిపారు.
భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా వ్యూహాత్మకంగా వృద్ధి చెందుతున్నాయి. రక్షణ, ఇంధనం, డిజిటల్ మార్కెట్లు, ఔషధ రంగాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక విభాగాల్లో సహకారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ద్వైపాక్షిక ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలపరచే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
గోయల్ మాటల్లో స్పష్టమవుతున్నట్టు ఒప్పందం ఎప్పుడు కుదురుతుందనే సమయం ప్రకటించకపోయినా మొత్తం ప్రక్రియ ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా దృఢంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ఎగుమతిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఒప్పందం, దేశ ఆర్థిక రంగానికి కొత్త అవకాశాలు తెరవవచ్చని అంచనా