రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా జరిగి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 40 మందికి పైగా సజీవదహనం కావడం అందరిని కలచివేసింది. అదేవిధంగా చేవెళ్ల సమీపంలో టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయి.
అయితే ఈ ఘటనలతో పరిస్థితి మారలేదు. రెండు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే నమ్మకం కోల్పోయేంతలా, ప్రమాదాలు పెరుగుతున్నాయి. రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాలు మరింత భయపెడుతున్నాయి.
తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి తర్వాత జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులను ఎవ్వరూ రక్షించుకునే అవకాశం కూడా లేకుండా ప్రమాదం జరిగింది.
ఈ హృదయ విదారక ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారి కీలక వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం ప్రమాదకర వంపులు, లోయలతో కూడిన ప్రాంతంగా పేరుగాంచింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనాలు అధిక ప్రమాదానికి గురవుతుంటాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా, ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.