Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. అన్ని శాఖల సమన్వయంతో నిర్వహణ!

Tirumala: అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాయి.

తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. భద్రత, రద్దీ నియంత్రణపై టీటీడీ ప్రత్యేక దృష్టి..

బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూల బఫర్ స్టాక్.. టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల: అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాయి.

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జరిగింది. అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అదనపు ఈవో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈవో రవిచంద్ర అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాల విషయంలో నాణ్యతకు ఏమాత్రం రాజీ పడకూడదని, రుచికరమైన ఆహారాన్ని భక్తులకు అందించాలని సూచించారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల కోసం 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా సిద్ధంగా ఉంచాలని సూచించారు.

గరుడసేవ రోజున భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తిరుమల, తిరుపతి మధ్య భక్తుల రాకపోకలకు అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీవారి సేవలో నిస్వార్థంగా పాల్గొనే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాల్లో వినియోగించుకోవాలని తెలిపారు.

సమన్వయ సమావేశం అనంతరం ఈవో రవిచంద్ర అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం అదనపు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీవీఎస్వో మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌లో సాలకట్ల, అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నందున అన్ని శాఖల మధ్య సమన్వయంతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించామని, మిగిలిన పనులన్నింటినీ సెప్టెంబర్ 14లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

తిరుమలకు ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈసారి రద్దీ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు తిరుమలకు వచ్చిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని బ్రహ్మోత్సవాల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించారు.

తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహనాల ట్రాఫిక్ నిర్వహణ, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్ రోడ్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడసేవకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.

గత బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లు, వివిధ రకాల పానీయాలు, 15 రకాల మెనూలను భక్తులకు అందించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి రద్దీకి అనుగుణంగా అదనపు వంటశాలలను ఏర్పాటు చేయడంతో పాటు నిత్యావసర సరుకుల సేకరణ, వాటి రవాణాకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విపత్తు, సంక్షోభ నిర్వహణ బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు.

పోలీసు శాఖ తరఫున అవసరమైన సిబ్బందిని నియమించడం, వారికి వసతి కల్పించడం, విధులను కేటాయించడం వంటి అంశాలపై కూడా ప్రణాళిక రూపొందించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం, సీవీఎస్వో ఆధ్వర్యంలో గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని భద్రతా సిబ్బంది మోహరింపుపై నిర్ణయాలు తీసుకున్నారు.

బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దేశంలోని 25 రాష్ట్రాల నుంచి 27 కళాబృందాలు పాల్గొననున్నాయి. వీటిలో రెండు విదేశీ కళాబృందాలు కూడా ఉంటాయి.

బ్రహ్మోత్సవాల విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసేందుకు విస్తృత ప్రచార ప్రణాళిక సిద్ధం చేశారు. ఎస్వీబీసీ, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కార్యక్రమాలను కోట్లాది మంది భక్తులకు చేరేలా ప్రచారం చేపట్టనున్నారు.

రెండు బ్రహ్మోత్సవాలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ఒకే బృందంగా పనిచేస్తేనే బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు.

భక్తుల భద్రత, సౌకర్యాలు, దర్శనం, రవాణా, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అత్యవసర నిర్వహణ వంటి అన్ని అంశాలను సమన్వయంతో అమలు చేయడమే ఈసారి ఏర్పాట్ల ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest