తిరుమలలో యువతను ఆధ్యాత్మికత వైపు ఆకర్షించేందుకు టీటీడీ ప్రత్యేకంగా ‘గోవింద కోటి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రామకోటిలా గోవింద నామస్మరణతో భక్తిని పెంపొందించుకోవచ్చనే భావనతో ఈ కార్యక్రమం రూపొందించారు. పది లక్షల సార్లు ‘గోవింద’ అని రాసిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు తిరుమలలో ఉచిత వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. ఈ కార్యక్రమం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది యువత దీనిని స్వీకరించి భక్తి మార్గంలో అడుగులు వేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నూతి పూజ అనే యువతి తాజాగా ఈ గోవింద కోటిని పూర్తి చేశారు. ఆమె హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రం హోమ్‌లో పనిచేస్తున్నారు. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతల కారణంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని నామాలు రాయడం ప్రారంభించారు. మొదట లక్ష నామాలు రాయాలని అనుకున్న పూజ, రాస్తున్న కొద్దీ కలిగిన ఆనందంతో చివరికి 10,01,116 నామాలు పూర్తి చేశారు.
గత 14వ తేదీన టీటీడీ ఆమెకు ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. పూజ తన భర్త అభిషేక్‌తో కలిసి తిరుమల వెళ్లి తొలి గడప నుంచే స్వామివారిని దర్శించుకున్నారు. ఆఫ్‌లైన్ లక్కీ డిప్ ద్వారా కల్యాణోత్సవ సేవలో కూడా పాల్గొన్నారు. నామాలు రాయడం ప్రారంభించిన తర్వాత పని ఒత్తిడిని అధిగమించగలిగానని, తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, మనశ్శాంతి లభించిందని పూజ తెలిపారు.
గోవింద కోటి పూర్తి చేసే యువతీ యువకులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. 25 ఏళ్ల లోపు యువకులు 10,01,116 సార్లు నామాలు రాస్తే, వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ వీఐపీ దర్శనం ఇచ్చేలా పథకం ఉంది. గోవింద కోటి పుస్తకాలు 200 పేజీలు ఉంటాయి; ఒక్కో పుస్తకంలో 39,600 నామాలు రాయవచ్చు. మొత్తం నామాలు పూర్తి చేయడానికి సుమారు 26 పుస్తకాలు అవసరం. నామాలు పూర్తి చేసిన పుస్తకాలను టీటీడీ పేష్కార్ కార్యాలయంలో సమర్పిస్తే మరుసటి రోజు దర్శనం లభిస్తుంది.
ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని సహా ముగ్గురు భక్తులు ఈ గోవింద కోటి పూర్తి చేసి వీఐపీ దర్శనం పొందారు. టీటీడీ ఈ కార్యక్రమాన్ని భక్తి పెంపొందించే సాధనంగా, యువతలో సనాతన ధర్మ విలువలను పరిచయం చేసే సాధనంగా భావిస్తోంది. భక్తులు సమర్పించిన శ్రద్ధను గౌరవిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవకాశాలు కల్పించాలని టీటీడీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.