ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు గాజాలోని హమాస్ శస్త్రాయుధాలను తొలగించే విషయంలో మరింత గట్టిగా స్పందించారు. “సులభ మార్గంలోనా, కఠిన మార్గంలోనా… గాజా నిరాయుధీకరణ తప్పనిసరి” అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిళ్లు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల యుద్ధ విరమణ ప్రణాళికపై జరుగుతున్న చర్చల నడుమ నేతన్యాహు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఆయన మాట్లాడుతూ, పాలస్తీనియా సంబంధించిన ప్రతిపాదనలను ఇజ్రాయెల్ తిరస్కరిస్తుందని, జోర్డాన్ నది పశ్చిమ తీరంలో పాలస్తీనియా ప్రభుత్వానికి స్థలం లేదని స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో మా వైఖరి ఎన్నేళ్ల నుంచో ఒకటే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇజ్రాయెల్ భద్రతే ప్రాధాన్యం అని ఆయన పేర్కొన్నారు.
హమాస్ పూర్తిగా ఆయుధాలు వదులుకోవాలని ట్రంప్ ప్రణాళికలో స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ ఎలా అమలు అవుతుందన్న దానిపై ప్రపంచ దేశాల్లో సందేహాలు ఉన్నాయి. హమాస్ ఇప్పటివరకు దీనిపై పూర్తి స్థాయి అంగీకారం తెలపకపోవడం ఈ చర్చను మరింత క్లిష్టం చేస్తోంది. అయినప్పటికీ, గాజాలో మిలిటెంట్ శక్తులు తగ్గించాల్సిందేనని నేతన్యాహు ఈ భూభాగం ఇకపై ఆయుధ గూడుగా మారలేనుఅని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాల్లో నేతన్యాహుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పాశ్చాత్య దేశాలు పాలస్తీనియా రాష్ట్ర హక్కును గుర్తిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, ఆయన ప్రభుత్వంలోని కఠిన వాద మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి బేజలెల్ స్మోత్రిచ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాయి. మా నేలపై పాలస్తీనియా రాష్ట్రం అనే మాట కూడా ఊహించలేం. దీనిపై ప్రభుత్వం వెంటనే కఠిన నిర్ణయం ప్రకటించాలి” అని ఆయన ట్వీట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి వంటి కీలక నాయకులు కూడా పాలస్తీనియా రాష్ట్రాన్ని పూర్తిగా తిరస్కరించారు. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ మంత్రి ఇటమర్ బెన్ గ్విర్ మాట్లాడుతూ, “పాలస్తీనియా అనే భావనే ఒక రాజకీయ ఆవిష్కరణ” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్‌లో సున్నిత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇదే సమయంలో, అమెరికా నడుం బిగించి తీసుకొచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం మొదటి విడతలో చివరి 20 మంది బతికి ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ కూడా దాదాపు 2,000 పాలస్తీనియా ఖైదీలను విడుదల చేసింది. అలాగే మృతదేహాల మార్పిడి కూడా పూర్తయ్యింది. ఈ చర్యలు తాత్కాలిక శాంతికి దారితీస్తున్నప్పటికీ, ఇంకా వాతావరణం పూర్తిగా స్థిరపడలేదు.
గాజాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రేపు ట్రంప్ శాంతి ప్రణాళికపై కీలక తీర్మానానికి ఓటింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఓటింగ్ ఫలితంతో గాజా భవిష్యత్తు దిశ కొంతమేర స్పష్టమయ్యే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ అంతర్గత విభేదాలు కలిసిపోవడంతో శాంతి మార్గం ఇంకా క్లిష్టంగా కనిపిస్తోంది.
నేతన్యాహు తాజా వ్యాఖ్యలు చూస్తే గాజా ప్రాంతంలో పూర్తి భద్రత, మిలిటెన్సీని పూర్తిగా తుదముట్టించడం మాత్రమే ఆయన ప్రభుత్వ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు మరికొన్ని రోజుల్లో ప్రపంచ రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తాయో చూడాలి.