లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధం. ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ కేవలం రెండు లవంగాలు నమలడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా యూజీనాల్ ఇందులో అధికంగా ఉండటంతో లవంగాలను ‘పోషకాల పవర్‌హౌజ్’గా పిలుస్తారు.
లవంగాల్లో వాపును తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల వచ్చే వాపు, నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. యూజీనాల్ కారణంగా డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు.
లవంగాల్లో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం లవంగాలను మరిగించిన నీటిని తాగడం వల్ల వాపు తగ్గి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
నోటి ఆరోగ్యానికి కూడా లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి. చిగుళ్ల నొప్పి తగ్గడమే కాకుండా నోటి దుర్వాసనను నివారిస్తాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో లవంగాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. లవంగాల్లోని యూజీనాల్, ఫ్లేవనాయిడ్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.