అమెరికాలో భారతీయ వంటకాలపై ఉన్న ఆదరణ ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది స్పైసీ వంటకాలు అమెరికన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఒకప్పుడు చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్ వంటి స్వల్ప మసాలా ఉన్న వంటకాలకే పరిమితమైన అమెరికన్లు, ఇప్పుడు ఘాటైన బిర్యానీలు, మసాలా కర్రీలు కూడా ఇష్టంగా ఆర్డర్ చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో జరుగుతున్న ఈ మార్పు అక్కడి ప్రవాస భారతీయులకు పెద్ద వ్యాపార అవకాశాలను తెరుస్తోంది.
కాలిఫోర్నియాలోని ఓ తెలుగు టెకీ తన అమెరికన్ సహోద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు ఇండియన్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లినప్పుడు, వారు ప్రత్యేకంగా దక్షిణాది వంటకాలనే అడగడం చూసి ఆశ్చర్యపడ్డారు. సాధారణంగా తక్కువ మసాలా ఉన్న థాయ్, జపనీస్, కొరియన్ వంటకాలను ఇష్టపడే అమెరికన్లు ఇప్పుడు స్పైసీ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ధరలు ఎక్కువైనా, ఫాస్ట్ ఫుడ్ కంటే రుచికరమైన భారతీయ వంటకాలను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు.
ఈ పెరిగిన డిమాండ్ కారణంగా అమెరికా వ్యాప్తంగా ఇండియన్ రెస్టారెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2025 అక్టోబర్ నాటికి యూఎస్‌లో దాదాపు 10,000 భారతీయ రెస్టారెంట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో కాలిఫోర్నియాలోనే 2,000, టెక్సాస్‌లో 1,500, న్యూయార్క్‌లో 1,000 రెస్టారెంట్లు పనిచేస్తున్నాయి. భారతీయ జనాభా, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రత్యేకంగా న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో, డాలస్ వంటి మెట్రో నగరాల్లో భారతీయ వంటకాల డిమాండ్ భారీగా పెరిగింది. వీటిలో డాలస్ మెట్రో ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మార్కెట్‌గా నిలుస్తోంది. ఇక్కడ దక్షిణాది వంటకాల ప్రత్యేకత ఎక్కువగా ఉండటం, పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉండటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.
ప్రస్తుతం డాలస్‌లోనే సుమారు 400 ఇండియన్ రెస్టారెంట్లు పని చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా దోసె, ఇడ్లీ, వైట్ రైస్ మీల్స్, బిర్యానీ, ఆంధ్ర కర్రీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ పెరగుతున్న డిమాండ్ దక్షిణాది రెస్టారెంట్ వ్యాపారులకు మాత్రమే కాకుండా, అమెరికాలోని మొత్తం ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీకి పెద్ద అవకాశం సృష్టిస్తోంది.