దొంగ వీలునామా తో మొత్తం భూమి కబ్జా! పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల అర్జీలతో టిడిపి గ్రీవెన్స్!
TDP Grievance: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల దుర్వినియోగం, ఆలయాల సమస్యలు, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు.
భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ..
టీడీపీ గ్రీవెన్స్‌లో ప్రజల అర్జీలు.. భూ సమస్యల నుంచి పింఛన్లు, రేషన్ వరకు వినతులు..
అమరావతి: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల దుర్వినియోగం, ఆలయాల సమస్యలు, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు. కొందరు ఉద్యోగ అవకాశాల కోసం రెస్యూమ్‌లు అందించగా, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆర్థిక సాయం కోరుతూ వినతులు ఇచ్చారు.
ప్రజల నుంచి అర్జీలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ స్వీకరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
మాజీ సర్పంచ్ కుమారుడిపై అవినీతి ఆరోపణలు
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి చెందిన రాంబాబు.. తమ గ్రామానికి చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ బండారు వెంకటలక్ష్మి కుమారుడు బండారు మల్లికార్జున్‌పై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, పాత పంచాయతీ భవనాలకు సంబంధించిన నిర్మాణ సామగ్రిని అక్రమంగా విక్రయించడం, అనుమతులు లేని నిర్మాణాలు, చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ.10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఆరోపించారు. కేవలం ఐదేళ్ల కాలంలో అధికార బలంతో ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాంబాబు కోరారు.
12.5 సెంట్ల స్థలం కోసం దాడి చేశారంటూ ఫిర్యాదు
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంకు చెందిన దావీదు రాజు.. తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భూముల పంపకాల్లో భాగంగా కొనుగోలు చేసిన సుమారు 12.5 సెంట్ల స్థలం విషయంలో వివాదం నెలకొందని తెలిపారు.
తాను ఇల్లు నిర్మించుకోవాల్సిన స్థలాన్ని రోడ్డు పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నించారని, అక్కడున్న కొబ్బరి చెట్లను నరికివేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు తనతో పాటు కొప్పాడ జయలక్ష్మిపై కొందరు వ్యక్తులు దాడి చేశారని, తలకు తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను గత 30 ఏళ్లుగా ఆంజనేయస్వామి, కనకదుర్గమ్మకు పూజలు చేస్తున్నానని, సనాతన ధర్మం, హిందూ గ్రంథాలను గౌరవిస్తున్నాననే కారణంతో తనపై తప్పుడు కేసులు పెట్టి ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
కోర్టు వివాదంలో ఉండగానే 4.66 ఎకరాల రిజిస్ట్రేషన్
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కొప్పాక ప్రసాద్ తన భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు చేశారు. చింతలపూడి శివారు కసుకర్రు గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 111/2లో 60 సెంట్లు, 111/3లో 62 సెంట్లు, 112/7లో ఎకరం కలిపి మొత్తం 2.22 ఎకరాల భూమి తనకు కుటుంబ భాగపంపిణీలో దక్కిందని తెలిపారు. 2014 నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పూర్వీకుల ఆస్తుల పంపకాలపై బాపట్ల 6వ అదనపు జిల్లా కోర్టులో కేసు విచారణలో ఉండగానే, ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా తన పెద్దన్న కొప్పాక వీరయ్య.. తల్లి రాధమ్మ పేరుతో 07-10-2020న నకిలీ వీలునామా సృష్టించారని ఆరోపించారు. దాని ఆధారంగా తన వాటా భూమితో కలిపి మొత్తం 4.66 ఎకరాలను తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
2023లో పంటను అక్రమంగా తరలించిన ఘటనపై వీరయ్యపై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. ఆ తర్వాత భూమి ఖాళీగా ఉందని, 2026 ఆగస్టు 10న కొందరు వ్యక్తులు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పనులు ప్రారంభించగా అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ఆగస్టు 17న గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి అధికారులు ఇచ్చిన గడువును ఆసరాగా చేసుకుని భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.
వందేళ్ల చరిత్ర ఉన్న నివాస ప్రాంతాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దుర్గప్రసాద్.. పాత ఆర్.ఎస్. నంబర్ 700, ప్రస్తుత సర్వే నంబర్లు 455/1A, 455/1B, 455/2 పరిధిలోని భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరారు.
సుమారు 27.95 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో దొమ్మేటి వారి వీధి, గోకల సెంటర్, సుబ్బారాయుడు చెరువు, సూర్యానగర్ వంటి నివాస ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. గత 50 నుంచి 100 ఏళ్లుగా సుమారు 500 కుటుంబాలు అక్కడ చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు నిర్మించుకున్నాయని పేర్కొన్నారు.
అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, రామాలయం, మున్సిపల్ పార్కుతో పాటు మున్సిపల్ కమిషనర్ అధికారిక నివాసం కూడా ఉన్నట్లు తెలిపారు. బ్యాంకు రుణాలు తీసుకుని, మున్సిపల్ అనుమతులతో నిర్మాణాలు చేపట్టి, క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నామని చెప్పారు.
1931లో రెవెన్యూ ‘ఎ’ రిజిస్టర్ తయారుకాక ముందే, అలాగే వక్ఫ్ బోర్డు ఏర్పాటుకు ముందే.. 1908 నాటికే కొన్ని ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయ్యాయని, ఇందుకు 11-11-1908 నాటి దస్తావేజు నంబర్ 3403/1908ను ఉదాహరణగా పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఈసీ రికార్డుల ప్రకారం ఇప్పటివరకు 1,000కు పైగా క్రయవిక్రయ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు.
అయితే రెవెన్యూ ‘ఎ’ రిజిస్టర్‌లో ‘మసీదు ఇనాం’గా నమోదై ఉందనే కారణంతో ఈ సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. క్షేత్రస్థాయి వాస్తవాలు, మున్సిపల్ పన్ను రికార్డులు, పాత దస్తావేజులను పరిశీలించి తమ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
40 ఏళ్ల నాటి ఆలయంపై ఆక్రమణ యత్నం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన దూబే జయదుర్గాబాయి.. చిట్టినగర్‌లోని కె.ఎల్. రావు నగర్‌లో ఉన్న శ్రీ జంబులాంబ దేవి ఆలయానికి సంబంధించి ఫిర్యాదు చేశారు.
సుమారు 40 ఏళ్ల క్రితం తన తాత బొందిలి నందగోపాల్ సింగ్ ఆలయాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు. అనంతరం తన తండ్రి దూబే ఈశ్వర్ ప్రసాద్, తల్లి జమునాబాయి, తాను ఆలయంలో నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆలయ ప్రాశస్త్యం పెరగడంతో బొందిలి ప్రవీణ్ సింగ్, బొందిలి జగన్నాధ్ సింగ్, బొందిలి నాగమణిబాయి, బొందిలి జయలక్ష్మీబాయి, బొందిలి జ్యోతి తదితరులు ఆలయాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. దసరా ఉత్సవాల సమయంలో గొడవలు సృష్టిస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు.
దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టగా కొందరు దాడులకు పాల్పడుతున్నారని, తాను దివ్యాంగురాలినని, తన తల్లి వృద్ధాప్యంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని ఆసరాగా చేసుకుని ఆలయం నుంచి బయటకు పంపేందుకు, ప్రాణహాని కలిగిస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పంచాయతీ దుకాణాల ద్వారా ఆదాయం కోల్పోతున్నామని ఫిర్యాదు
అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి చెందిన ఎన్.వి.వి. భాస్కరప్రసాద్, డి. చినబాలయ్య.. పంచాయతీకి చెందిన వాణిజ్య దుకాణాలపై ఫిర్యాదు చేశారు.
1997లో ప్రజావసరాల కోసం ఇరిగేషన్ శాఖ సర్వే నంబర్ 76లోని 25 సెంట్ల స్థలాన్ని గ్రామ పంచాయతీకి బదిలీ చేసిందని తెలిపారు. గ్రామ ప్రధాన కూడలి కావడంతో అక్కడ బస్ షెల్టర్ నిర్మించారని, పంచాయతీకి శాశ్వత ఆదాయం వచ్చేలా పక్కనే 13 వాణిజ్య దుకాణాలు నిర్మించినట్లు పేర్కొన్నారు.
అయితే అధికారికంగా అద్దె కేటాయింపు ప్రక్రియ పూర్తికాకముందే వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఆ దుకాణాలను ఆక్రమించి, పంచాయతీకి అద్దె చెల్లించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం కోల్పోతున్నామని తెలిపారు. దుకాణాలను ఖాళీ చేయించి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థలంలోకి అక్రమ ప్రవేశం, చెట్ల నరికివేతపై ఫిర్యాదు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన ఎం. శ్యామ్ ప్రసాద్.. సర్వే నంబర్ 363/1లోని తమ స్థలంలోకి అదే గ్రామానికి చెందిన వెలగ సాంబశివరావు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపించారు.
అక్రమ చొరబాటును ప్రశ్నించినందుకు తన వయోవృద్ధ తండ్రిపై కూడా దాడికి ప్రయత్నిస్తూ బెదిరిస్తున్నారని తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండా స్థలంలోని వేప చెట్లను నరికివేసి అక్కడే తగలబెట్టారని ఆరోపించారు. రాజకీయ అండదండలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
భూమికి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని వినతి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పెద్ద ఓబులేసు.. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 214, 771, 370, 287, 372లో తనకు సుమారు 10 ఎకరాల భూమి ఉందని తెలిపారు.

ఆ భూమికి స్పష్టమైన హద్దులు లేకపోవడంతో పలుమార్లు అధికారులను కలిసి సర్వే నిర్వహించి హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. అధికారులు స్పందించి భూమిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పలు సమస్యలపై వినతులు
ప్రజావినతుల కార్యక్రమంలో భూ సమస్యలతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై కూడా పలువురు అర్జీలు సమర్పించారు. ఉద్యోగ అవకాశాల కోసం కొందరు రెస్యూమ్‌లు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని, చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరికొందరు ఆర్థిక సాయం కోరారు.

ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని నేతలు తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగేలా సమస్యల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.

Tags
Be the first to react
