Chandrababu: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం.. చీరాలలో సీఎం చంద్రబాబు ప్రారంభం!
Chandrababu: రాష్ట్రంలోని చేనేత కుటుంబాల సంక్షేమానికి మరో కీలక అడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ (Netanna Sevalo) అనే కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
చీరాలలో ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
జాతీయ చేనేత దినోత్సవం వేళ నేతన్నలకు భారీ కానుక.. ‘నేతన్న సేవలో’ ప్రారంభం..
అమరావతి: రాష్ట్రంలోని చేనేత కుటుంబాల సంక్షేమానికి మరో కీలక అడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ (Netanna Sevalo) అనే కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.179 కోట్లు విడుదల చేయనుంది.
71 వేలకుపైగా చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి
‘నేతన్న సేవలో’ పథకం చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. చేనేత రంగంలో కొనసాగుతున్న కుటుంబాలకు నేరుగా వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నారు. దీంతో వేలాది కుటుంబాలకు ఉపశమనం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకంతో పాటు చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
అందులో భాగంగా చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్‌లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు వ్యయం చేస్తోంది.
నేతన్నలకు నెలకు రూ.4 వేల పెన్షన్
50 సంవత్సరాలు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా 85 వేల మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది.
చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతం కోసం 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్ల క్యాష్ క్రెడిట్ సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. చేనేత పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది.
వాటిలో ముఖ్యంగా ఉప్పాడలో ప్రత్యేక మౌలిక వసతుల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, అమరావతి సమీపంలోని శాకమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం, విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సస్టైనబుల్ టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్, ఈ ప్రాజెక్టులు చేనేత రంగానికి కొత్త అవకాశాలు కల్పించనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుక్రవారం చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:05 గంటలకు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:35 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4:10 గంటలకు జాండ్రపేటలో నిర్వహించే చేనేత కార్మికుల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 4:45 గంటలకు కొత్తపేటలో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
చేనేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం
చేనేత పరిశ్రమ రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నేతన్నల జీవనోపాధి మెరుగుపడేందుకు ఆర్థిక సహాయం, ఉచిత విద్యుత్, పెన్షన్, సహకార సంఘాలకు ఆర్థిక మద్దతు, మౌలిక వసతుల కల్పన వంటి చర్యలను సమగ్రంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభంతో చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక భరోసా అందడంతో పాటు, రాష్ట్ర చేనేత రంగ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Tags
Be the first to react