రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్... చంద్రబాబు కీలక ఆదేశాలు!

Chandrababu Review: ఏపీలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉత్పత్తి వ్యయం తగ్గించడం, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్రాజెక్టుల వేగవంతానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
  • మరో ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుదల.. ముందస్తు చర్యలకు సీఎం ఆదేశం

  • విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు.. చంద్రబాబు కీలక నిర్ణయం!

  • ఏపీలో గ్రీన్ ఎనర్జీకి భారీ ప్రణాళిక.. రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబడులు!

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు విద్యుత్ డిమాండ్ 18.23 శాతం పెరిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాకాలంలో కూడా విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సీఎం సూచించారు.

విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు మార్కెట్‌లో విద్యుత్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ అవసరాల కోసం ప్రైవేటు సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి ప్రభుత్వ ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అందుకు అనుగుణంగా విద్యుత్ కొనుగోలు భారం తగ్గించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సరఫరా వ్యవస్థల్లో కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పెద్ద సంఖ్యలో చోరీకి గురవుతున్న విషయంపై కూడా సీఎం సమీక్షించారు. రాగి తీగల కోసం ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలిస్తున్నారని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ చోరీలను అరికట్టేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 2024 నుంచి విద్యుత్ రంగంలో 103 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా సుమారు రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద రూ.21,838 కోట్లతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా 47 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు త్వరగా టెండర్లు పిలిచి రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 36,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో 27 ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. అలాగే పీఎం సూర్య ఘర్ పథకం అమలులో ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానానికి తీసుకెళ్లాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 7.42 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 10 లక్షలకు చేర్చాలని సీఎం ఆదేశించారు. పీఎం కుసుమ్ పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భూసేకరణ 100 శాతం పూర్తికాగా, నిర్మాణ పనులు 91 శాతం పూర్తయ్యాయి.

Tags

Be the first to react

Latest