బియ్యం ధరలపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. కిలో రూ.47కే ! 26 కిలోల బస్తా రూ. 1,222 మాత్రమే!

ఏపీలో బియ్యం, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ఎంటీయూ బియ్యం కిలో రూ. 47 (26 కేజీల బస్తా రూ. 1,222), బీపీటీ సోనా/సాంబ రూ. 66, హెచ్ఎంటీ/ఆర్ఎన్ఆర్ రూ. 76, జైశ్రీరామ్ రూ. 82 గా ధరలు ఖరారు చేయడంతో పాటు మొబైల్ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే 'ధరణి' బియ్యం విక్రయించనున్నారు. డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు (₹100), గోధుమ పిండి (₹25), పామాయిల్ (₹125) సరఫరా చేయనుండగా, మిల్లర్లు, డీలర్ల నిల్వలపై కఠిన పరిమితులు విధించారు.

బియ్యం ధరల నియంత్రణకు చంద్రబాబు కీలక ఆదేశాలు
బియ్యం ధరల నియంత్రణకు చంద్రబాబు కీలక ఆదేశాలు
  • ధరల పెరుగుదలపై నిరంతర నిఘా కోసం ఏడాది కాలానికి యాక్షన్ ప్లాన్, ప్రతివారం అధికారుల సమీక్షకు సీఎం చంద్రబాబు ఆదేశం!

  • డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ. 100, గోధుమ పిండి రూ. 25, లీటర్ పామాయిల్ రూ. 125 కు సరఫరా!

  • రైతుబజార్లలో కిలో ఉల్లి రూ. 35 కే విక్రయం – రాష్ట్రంలో నాసిక్ రకం ఉల్లి సాగు, కంది పంట ప్రోత్సాహంపై సీఎం సూచన!

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ రకాల నాన్-బాస్మతి బియ్యం ధరలను ఖరారు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎంటీయూ సాధారణ రకాలు (MTU Common Varieties) కిలో రూ. 47 గా నిర్ణయించగా, 26 కేజీల బియ్యం బ్యాగ్ రూ. 1,222 కే లభించనుంది. అలాగే బీపీటీ 3291 (సోనా), బీపీటీ 5204 (సాంబ), కేఎన్ఎం రకాలు కిలో రూ. 66; హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రకాలు కిలో రూ. 76; జైశ్రీరామ్ రకం కిలో రూ. 82 గా నిర్దేశించారు. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇళ్ల వద్దకే మొబైల్ వాహనాల్లో 'ధరణి' బ్రాండ్ బియ్యం – నెలకు రూ. 100 కోట్లు

నిత్యావసర సరుకుల ధరలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వం నెలకు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. రైతు బజార్లలో తక్కువ ధరకే విక్రయిస్తున్న 'ధరణి' బ్రాండ్ బియ్యానికి ప్రజల నుంచి మంచి డిమాండ్ వస్తున్నందున, మొబైల్ వాహనాల ద్వారా నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ బియ్యాన్ని విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్

సామాన్యులపై ధరల భారం పడకుండా డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ. 100, కిలో గోధుమ పిండి రూ. 25, లీటర్ పామాయిల్ రూ. 125 చొప్పున సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే రైతుబజార్లలో కిలో ఉల్లి రూ. 35 కే విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. ధరల నియంత్రణకు ఏడాది కాలానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, ప్రతివారం సమీక్షించాలని, రాష్ట్రంలో నాసిక్ రకం ఉల్లి, కంది సాగును ప్రోత్సహించాలని, కూరగాయల ధరలు పెరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

మిల్లర్లు, డీలర్ల నిల్వలపై పరిమితులు – ప్రతి శుక్రవారం పోర్టల్‌లో వివరాలు

కేంద్రం జారీ చేసిన అనుమతిని ప్రస్తావిస్తూ పౌరసరఫరాల శాఖ ధాన్యం, బియ్యం నిల్వలపై కఠిన పరిమితులు విధించింది. ప్రతి సంస్థ తమ వద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను కేంద్ర ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో వారంలోగా ప్రకటించి, ప్రతి శుక్రవారం అప్‌డేట్ చేయాలి. సరుకు ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా వచ్చిందో లావాదేవీల రికార్డులు తప్పనిసరిగా ఉంచాలి. సరుకు దాచిపెట్టినా, తప్పుడు వివరాలు నమోదు చేసినా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు (బియ్యం 10 క్వింటాళ్లు, ధాన్యం–బియ్యం కలిపి 25 క్వింటాళ్లకు మించకపోతే ఈ నిబంధనలు వర్తించవు).

ట్రేడింగ్ మిల్లులు, హోల్‌సేల్, రిటెయిల్ నిల్వ పరిమితులు & ధరల పట్టిక

నిబంధనల ప్రకారం ట్రేడింగ్ రైస్ మిల్లులు (సీఎమ్మార్, ప్రభుత్వ నిల్వలు మినహా) 4,000 క్వింటాళ్లు లేదా వారం మిల్లింగ్ సామర్థ్యానికి సరిపడా (ఏది ఎక్కువైతే అది) నిల్వ చేసుకోవచ్చు. హోల్‌సేల్ డీలర్లకు కార్పొరేషన్ల పరిధిలో 1,000 క్వింటాళ్లు, జిల్లా కేంద్రాల్లో 500 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో 250 క్వింటాళ్లు; రిటెయిల్ డీలర్లకు పట్టణ ప్రాంతాల్లో 100 క్వింటాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 50 క్వింటాళ్లు నిల్వ పరిమితి విధించారు. ఎగుమతిదారులు పోర్టు ప్రాంత కలెక్టర్ నుంచి రిలీజ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ప్రతి సంస్థ మెయిన్ గేటు వద్ద అందరికీ కనిపించేలా వివిధ రకాల బియ్యం, సరుకుల ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలని ఆదేశించారు.

Tags

Be the first to react

Latest