Nara Lokesh: "ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్ బస్సు వచ్చింది".. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రసంగం!
Nara Lokesh: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మాట్లాడిన మంత్రి లోకేష్, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణాన్ని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని, భోగాపురం విమానాశ్రయం ప్రాధాన్యాన్ని విశదీకరించారు.
వికసిత్ భారత్‌కు ప్రతిరూపం భోగాపురం ఎయిర్‌పోర్ట్: మంత్రి నారా లోకేష్..
ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా భోగాపురం విమానాశ్రయం: లోకేష్..
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మాట్లాడిన మంత్రి లోకేష్, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణాన్ని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని, భోగాపురం విమానాశ్రయం ప్రాధాన్యాన్ని విశదీకరించారు.
"ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్ బస్సు వచ్చింది"
గతంలో కొందరు "ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి విమానాశ్రయం ఎందుకు?" అంటూ ఉత్తరాంధ్రను తక్కువ చేసి మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. అలాంటి విమర్శలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమే సమాధానమని అన్నారు.
"ఎర్రబస్సు రాదన్న చోటుకు ఇప్పుడు ఎయిర్ బస్సు వచ్చింది. అదే కాదు... దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇక్కడికి రావడం ఉత్తరాంధ్ర గౌరవానికి నిదర్శనం. ఇదే ఉత్తరాంధ్ర దెబ్బ" అంటూ సభలో ఉత్సాహభరిత వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చిన విమానాశ్రయం
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లో నడిచిన ఈ నేల ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని లోకేష్ అన్నారు. ఈ విమానాశ్రయం కేవలం ఒక మౌలిక వసతి ప్రాజెక్టు మాత్రమే కాదని, ప్రధాని నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి దార్శనికత కలయికకు ప్రతీక అని అభివర్ణించారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం, ప్రభుత్వ దూరదృష్టి కలిసి ఈ మహత్తర ప్రాజెక్టును సాకారం చేశాయని పేర్కొన్నారు.
"నమో అంటే అభివృద్ధి.. భరోసా.. భద్రత"
ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన లోకేష్, అల్లూరి సీతారామరాజు ధైర్యం, దేశభక్తి, పట్టుదలలో కనిపించే లక్షణాలు మోదీ నాయకత్వంలో కూడా కనిపిస్తున్నాయని అన్నారు.
"నమో అంటే ధైర్యం... నమో అంటే విశ్వాసం... నమో అంటే సురక్షిత భారత్. అభివృద్ధి, పేదల సంక్షేమం, దేశ భవిష్యత్తుకు భరోసా అంటే నమో" అని పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధి వేగం
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, కేంద్రంలోని ప్రధాని మోదీ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసిందని లోకేష్ అన్నారు.
ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయంతో పాటు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిరక్షణ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, AMCA ఫైటర్ జెట్ ప్రాజెక్టులు వంటి కీలక కార్యక్రమాలను ప్రస్తావించారు.
భోగాపురాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ప్రజల నమ్మకం
ప్రధాని మోదీ విజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు సామర్థ్యం కలిసి ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చుతున్నాయని లోకేష్ అన్నారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్డీఏకు ఘన విజయం అందించారని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఆ విశ్వాసానికి తగ్గట్టుగా అభివృద్ధిని అందించడం తమ బాధ్యత అని చెప్పారు.
నదులు, సముద్ర తీరం, సహజ వనరులు, అడవులు ఉత్తరాంధ్రకు గొప్ప బలమని, వాటిని అభివృద్ధికి అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
జీఎంఆర్ సేవలను ప్రశంసించిన మంత్రి
రాజాం ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్) రికార్డు సమయంలో విమానాశ్రయం నిర్మించి తన జన్మభూమి రుణం తీర్చుకున్నారని లోకేష్ కొనియాడారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కూడా ప్రాజెక్టు నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తయ్యేలా కృషి చేశారని అభినందించారు.
ఉత్తరాంధ్రకు ఉపాధి, పెట్టుబడుల కేంద్రంగా భోగాపురం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త ఆర్థిక అవకాశాలను తీసుకురానుందని మంత్రి అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఎగుమతులు, దిగుమతులకు ప్రధాన కేంద్రంగా మారుతుందని చెప్పారు.
రోడ్డు, రైలు, విమాన, సముద్ర రవాణా అనుసంధానంతో ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి "గ్రోత్ ఇంజిన్"గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు అవకాశాల గడ్డ"
ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు, వెనుకబాటుతనం గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు ఉద్యోగాలు, పెట్టుబడులు, అభివృద్ధి, బంగారు భవిష్యత్తు గుర్తుకు వస్తోందని లోకేష్ పేర్కొన్నారు.
"ఇకపై ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలే ఉత్తరాంధ్రకు వస్తాయి" అని అన్నారు. గత రెండేళ్లలో ప్రధాని మోదీ ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని చెప్పారు.
ఈస్ట్ కోస్ట్ ఇండియా యుగం ప్రారంభమైంది
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వ స్థిరత్వం అత్యంత అవసరమని మంత్రి లోకేష్ అన్నారు. "సంక్షేమం, అభివృద్ధి రెండూ మా ప్రభుత్వానికి సమాన ప్రాధాన్యం. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం కాదు... ఇది ఈస్ట్ కోస్ట్ ఇండియా యుగం. సుందర్‌బన్ నుంచి శ్రీహరికోట వరకు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాకెట్ వేగంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది" అని పేర్కొన్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్రకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు.
Be the first to react