Kondapalli Srinivas: దశాబ్దాల వంతెన కల సాకారం.. రూ.6.50 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం!
Kondapalli Srinivas: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మర్రివలస గ్రామ ప్రజల వంతెన కలకు ఎట్టకేలకు అడుగు పడింది. రూ.6.50 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు, వంతెన నిర్మాణానికి రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం శంకుస్థాపన చేశారు.
దశాబ్దాల నిరీక్షణకు తెర.. మర్రివలస వంతెన నిర్మాణానికి శంకుస్థాపన..
వంతెన కోసం ఏళ్లుగా ఎదురుచూసిన మర్రివలస ప్రజలకు ఊరట.. నిర్మాణ పనులు ప్రారంభం..
విజయనగరం: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మర్రివలస గ్రామ ప్రజల వంతెన కలకు ఎట్టకేలకు అడుగు పడింది. రూ.6.50 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు, వంతెన నిర్మాణానికి రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఆండ్ర ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి మర్రివలస వరకు ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. గ్రామానికి మంత్రి చేరుకున్న సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. హర్షధ్వానాల మధ్య వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అదే సమయంలో రూ.10 లక్షలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఎన్నికల హామీని నెరవేర్చడం సంతోషంగా ఉంది
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మర్రివలస ప్రజల చిరకాల కోరికను నెరవేర్చే పనులకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు.
చంపావతి నది ప్రవహించే ప్రాంతాల్లోని కొనిస, పట్రువాడ, మర్రివలస గ్రామాల రాకపోకల కోసం గతంలోనే వంతెనల నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాటి ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అందులో భాగంగా యువ నాయకుడు నారా లోకేష్ కొనిస, పట్రువాడ వంతెనలను పూర్తి చేయించి ప్రారంభించారని మంత్రి తెలిపారు.
సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి
నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన సమయంలో సార్వగడ్డ రిజర్వాయర్‌తో పాటు మర్రివలస, జామి మండలంలో వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు మంత్రి చెప్పారు.
తన విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు వెంటనే సానుకూలంగా స్పందించారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మర్రివలస వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి ప్రాజెక్టు నిధులు మంజూరు చేయడంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపారని మంత్రి పేర్కొన్నారు.
తాత పైడితల్లి నాయుడే స్ఫూర్తి
తన తాత పైడితల్లి నాయుడిని ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. 2004 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ప్రభావం ఉన్నప్పటికీ తన తాత పైడితల్లి నాయుడు ఎంపీగా గెలవడానికి నియోజకవర్గ ప్రజలే ప్రధాన కారణమని గుర్తు చేసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు.
విద్యతోనే పిల్లలకు మంచి భవిష్యత్తు
గ్రామంలోని ప్రతి చిన్నారినీ తప్పనిసరిగా చదివించాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్య ద్వారానే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు.
చదువు వల్ల కుటుంబ జీవన విధానంలో కూడా మార్పు వస్తుందని చెప్పారు. యువ నాయకుడు నారా లోకేష్ ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రానికి అనేక కంపెనీలను తీసుకొస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో మెంటాడ–గజపతినగరం–పురిటిపెంట రోడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.
అంగన్వాడీ, పాఠశాల భవనాల నిర్మాణానికి హామీ
మర్రివలసలోని అంగన్వాడీ, పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే సంవత్సరానికల్లా కొత్త భవనాల నిర్మాణం చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే మర్రివలస స్టేజ్ వద్ద విద్యార్థుల కోసం బస్సు ఆపేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలకు మేలు చేస్తున్న కూటమి నాయకులను గెలిపించాలని మంత్రి కోరారు. అప్పుడే అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని అన్నారు.
‘మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నారు’
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి మాట్లాడుతూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాటలకే పరిమితం కాకుండా పనులు చేసి చూపిస్తున్నారని అన్నారు. మర్రివలస వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని అన్నారు.
బీజేపీ నాయకురాలు రెడ్డి పావని మాట్లాడుతూ మర్రివలస ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తున్న ఘనత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు దక్కుతుందని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు నాంది పలికేలా చిన్నారులతో రిబ్బన్ కట్ చేయించడం మంత్రి ముందుచూపుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మక్కువ శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం టీడీపీ చిత్తశుద్ధిని చూపిస్తోందన్నారు. పీఏసీఎస్ డైరెక్టర్ కుమార్ ఆండ్ర రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టి రైతులకు మేలు చేయాలని మంత్రిని కోరారు.
‘కలయో.. నిజమో తెలియడం లేదు’
వంతెన నిర్మాణంపై మర్రివలస గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకాలం వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుందని భావించామని చెప్పారు. ఇప్పుడు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగడంతో తమకు నమ్మశక్యంగా లేదని తెలిపారు. వంతెన అందుబాటులోకి వస్తే పిల్లల భవిష్యత్తు మారుతుందని అన్నారు.
ముఖ్యంగా విద్య, వైద్యం కోసం రవాణా సౌకర్యం వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనందంతో తమ కళ్లలో నీళ్లు తిరిగాయని పలువురు గ్రామస్తులు తెలిపారు. గ్రామ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to react