Uppada: ఉప్పాడ తీరానికి రక్షణ కవచం.. రూ.323 కోట్ల ప్రాజెక్టుకు డీపీఆర్ పనులు షురూ!
Uppada: దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను వేధిస్తున్న సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. తీర రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన పనులను ఐఐటీ మద్రాస్ ప్రారంభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఉప్పాడ తీర రక్షణ గోడకు కీలక అడుగు.. ఐఐటీ మద్రాస్‌తో డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం..
పవన్ కల్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే.. డ్రోన్లతో తీర ప్రాంత మ్యాపింగ్..
రూ.323 కోట్లతో సముద్ర కోతకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు..
పిఠాపురం: దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను వేధిస్తున్న సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. తీర రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన పనులను ఐఐటీ మద్రాస్ ప్రారంభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
రూ.323 కోట్ల నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్‌తో ప్రతిపాదించిన తీర రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఉప్పాడ తీరంలో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తోంది.
అత్యాధునిక సాంకేతికతతో తీర సర్వే
తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో అనుభవం ఉన్న ఐఐటీ మద్రాస్ నిపుణులు గత వారం రోజులుగా ఉప్పాడలో వివిధ రకాల అధ్యయనాలు చేస్తున్నారు.
అధునాతన డ్రోన్లతో తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంత మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్980 జీఎన్‌ఎస్‌ఎస్ ఆర్‌టీకే సాంకేతికతను వినియోగిస్తున్నారు.
తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత వంటి అంశాలను నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. భూభాగంలో వస్తున్న మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలను కూడా పరిశీలిస్తున్నారు.
నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాలను సేకరిస్తున్నారు. తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలను కూడా సేకరించి శాస్త్రీయ పరీక్షలు చేస్తున్నారు.
సముద్రపు లోతు నుంచి బీచ్ ఆకృతి వరకు అధ్యయనం
ఉప్పాడ తీరంలో బాతిమెట్రిక్ సర్వే నిర్వహిస్తున్నారు. దీని ద్వారా సముద్రపు లోతు, సముద్ర అడుగు భాగం స్థాయి, అందులో వస్తున్న మార్పులను గుర్తిస్తున్నారు. అలాగే బీచ్ ఆకృతి, వాలు, ఎత్తు వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
షోర్‌లైన్ మ్యాపింగ్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. తీర ప్రాంత కోత ఏ స్థాయిలో ఉంది? భవిష్యత్తులో అది ఎలా మారే అవకాశం ఉంది? అనే అంశాలను అంచనా వేయడానికి ఈ సర్వే కీలకంగా మారనుంది.
రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తు
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించాలి? అనే అంశంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత అందుబాటులోకి వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రక్షణ గోడకు అనువైన అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు.
భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా, దీర్ఘకాలం ఉపయోగపడే విధంగా రక్షణ గోడ డిజైన్‌ను రూపొందించనున్నారు. ఐఐటీ మద్రాస్ బృందం అందించే నివేదిక ఆధారంగా డిజైన్, డీపీఆర్‌లోని సాంకేతిక అంశాలను ఖరారు చేయనున్నారు.
నాలుగు దశాబ్దాలుగా సముద్ర కోతతో ఇబ్బందులు
ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు గత నాలుగు దశాబ్దాలుగా సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. పలు గ్రామాలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ సమస్య కారణంగా అనేక కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయి నిర్వాసితులయ్యాయి. రైతులు వందల ఎకరాల పంట భూములను కోల్పోయారు. తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు తీర కోత తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది.
పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ
ఉప్పాడ తీర ప్రాంత సమస్య పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీర కోతను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రతిపాదన మేరకు సముద్ర రక్షణ గోడ నిర్మాణంతో పాటు మరికొన్ని ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలకు ఆమోదం లభించింది.
సీ ప్రొటెక్షన్ వాల్, గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి అనుగుణంగా డీపీఆర్ తయారీ పనులు ప్రారంభమయ్యాయి.
డిజైన్‌తో పాటు పర్యావరణ అనుమతులు
ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. డిజైన్, డీపీఆర్ తయారీతో పాటు పర్యావరణం, ఇతర అవసరమైన అనుమతుల ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు.
నిర్ణీత గడువులో డిజైన్, డీపీఆర్‌ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. పిఠాపురం పర్యటన సందర్భంగా ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో పవన్ కల్యాణ్ సమావేశమై డిజైన్, డీపీఆర్ పురోగతిపై చర్చించనున్నారు.
ఉప్పాడ తీర రక్షణ గోడ ప్రాజెక్టు పూర్తయితే సముద్ర కోతతో ఏళ్లుగా నష్టపోతున్న తీర ప్రాంత ప్రజలకు భద్రత కల్పించే అవకాశం ఉంది. తమ ఇళ్లు, భూములు, జీవనాధారాన్ని కోల్పోతున్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.
Tags
Be the first to react