ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ నుంచి కర్ణాటక ఐటీ రాజధాని బెంగళూరు వరకు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, అలాగే తిరుపతి వెళ్లే భక్తులతో ఈ రూట్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇంతటి డిమాండ్ ఉన్న మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవుతుందని గత ఆరు నెలలుగా ప్రయాణికుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
మేలో వస్తుంది అన్నారు, ఆగస్టులో అన్నారు ఆ తర్వాత డిసెంబర్ 10న స్టార్ట్ అవుతుందని పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. రైల్వే బోర్డు ఈ రూట్‌కు 20711 అనే నంబర్‌ను కూడా కేటాయించింది. అయినప్పటికీ తేదీలు మారుతున్నాయే తప్ప, రైలు మాత్రం ఇప్పటివరకు పట్టాలపైకి రాలేదు. అసలు ఈ ఆలస్యం వెనుక సాంకేతిక సమస్యలున్నాయా, లేక రెండు రాష్ట్రాల మధ్య రైల్వే జోన్ల మధ్య సయోధ్య లోపమేనా అనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ కథనం.
ముందుగా ఈ రైలు వెళ్లాల్సిన రూట్‌ను పరిశీలిస్తే అసలు సమస్య అక్కడే మొదలైనట్లు తెలుస్తుంది. సాధారణంగా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే గుంటూరు- నంద్యాల - గుంతకల్లు - ధర్మవరం మీదుగా వెళ్లే మార్గం ఒకటి ఉంది. మరోవైపు ఒంగోలు - నెల్లూరు- గూడూరు- రేణిగుంట- కాట్పాడు మీదుగా వెళ్లే మార్గం ఉంది. రైల్వే బోర్డు రెండో మార్గాన్ని ఎంచుకుంది. దీనికి ప్రధాన కారణం బెంగళూరు ఐటీ ఉద్యోగులతో పాటు తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని కూడా వందే భారత్ ద్వారా కవర్ చేయాలనే ఆలోచన కానీ ఇక్కడే ఒక సాంకేతిక చిక్కు ఎదురైంది.
రేణిగుంట జంక్షన్ దాటి రైలు తిరుపతి స్టేషన్‌లోకి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి రివర్స్ లేదా బైపాస్ లైన్ ద్వారా కాట్పాడు వైపు సాగాల్సి ఉంటుంది. దీనిని సర్క్యూటస్ రూట్‌గా అధికారులు పిలుస్తున్నారు. వందే భారత్ అంటేనే వేగం. అలాంటి రైలును ఇలా తిరుపతిలో టచ్ చేయడం వల్ల ప్రయాణ సమయం పెరిగి, మొదట లక్ష్యంగా పెట్టుకున్న ఎనిమిది గంటల టైమ్ మిస్ అవుతోంది. దీంతో టైమ్ టేబుల్ సిద్ధం చేయడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
మరో కీలక కారణం ఇంటర్ జోనల్ సమస్య విజయవాడ నుంచి గూడూరు వరకు మార్గం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉంటుంది. ఈ జోన్ వందే భారత్‌కు అవసరమైన స్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. కానీ గూడూరు దాటిన తర్వాత రైలు సదర్న్ రైల్వే పరిధిలోకి, ఆపై సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా గూడూరు–కాట్పాడు లైన్ రైల్వేకు బంగారు బాతులాంటిది. కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే భారీ గూడ్స్ రైళ్లు, ఫ్రైట్ ట్రాఫిక్ ఈ మార్గంలో విపరీతంగా నడుస్తుంటాయి.
ప్రస్తుతం ప్రతిపాదించిన టైమింగ్స్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వందే భారత్ ఈ సెక్షన్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో వందే భారత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలంటే గూడ్స్ రైళ్లను పక్కన నిలిపేయాల్సి వస్తుంది. దీనికి సదర్న్ రైల్వే ఒప్పుకోవడం లేదని సమాచారం. గూడ్స్ రవాణా మాకు ముఖ్యమని, ఆ టైమ్‌లో ప్యాసింజర్ ట్రైన్‌కు స్లాట్ ఇవ్వలేమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జోన్ల మధ్య సమన్వయం కుదరకపోవడమే ఫైల్ పెండింగ్‌కు ప్రధాన కారణంగా వినిపిస్తుంది.
మరో అంశం రోలింగ్ స్టాక్ అంటే రైలు బోగీల సమస్య మొదట ఈ రూట్‌లో 16 కోచ్‌లతో పూర్తి సామర్థ్య వందే భారత్ నడపాలని ప్రణాళిక రూపొందించారు. అయితే సర్వేలో ఒక విషయం తేలింది అది ఏమిటంటే విజయవాడ నుంచి బెంగళూరు వరకు పగటిపూట ప్రయాణించే వారి కంటే రాత్రిపూట స్లీపర్ బస్సుల్లో వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 700 కిలోమీటర్ల దూరం కావడంతో పగలు కూర్చుని ప్రయాణించడానికి ప్రయాణికులు ఎంతవరకు ఆసక్తి చూపుతారనే సందేహం రైల్వేకు కలిగింది.
అందుకే సేఫ్ సైడ్‌గా 8 కోచ్‌ల మినీ వందే భారత్ కేటాయించారు. కానీ చెన్నై ఫ్యాక్టరీ నుంచి వచ్చే కొత్త రేక్స్‌ను రాజకీయ ఒత్తిళ్లు ఉన్న ఇతర రూట్లకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మనకు కేటాయించిన రేకు వేరే జోన్‌కు వెళ్లిపోవడంతో లాంచ్ డేట్లు మారుతున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇంకో కీలకమైన అంశం మెయింటెనెన్స్ ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టర్మినల్ (Sir M. Visvesvaraya Terminal - SMVT)
చేరుకోవాల్సి ఉంటుంది. వందే భారత్ రైళ్లకు వారానికి ఒకసారి ప్రత్యేక పిట్ లైన్ మెయింటెనెన్స్ తప్పనిసరి. ఇప్పటికే ఎస్‌ఎమ్‌వీటీ స్టేషన్ బిజీగా ఉంది. కొత్తగా వచ్చే ఈ రైలుకు మంగళవారమా, గురువారమా మెయింటెనెన్స్ స్లాట్ ఇవ్వాలన్న దానిపై బెంగళూరు డివిజన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.
ఈ అన్ని అంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లు విషయంలో పూర్తిగా సానుకూలంగా ఉంది. విజయవాడ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఖాయమని, ప్రస్తుతం ఎదురవుతున్నవి కేవలం తాత్కాలిక సాంకేతిక సమస్యలేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం నిరంతరం కొనసాగుతోందని, త్వరలోనే ప్రయాణికులకు శుభవార్త వినిపిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది..