నెల్లూరు జిల్లాకు మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ వచ్చి చేరింది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీగా పేరుగాంచిన క్రిస్ సిటీ (Kris City) సింహపురి ప్రాంత అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. కోట, చిల్లకూరు మండలాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక నగరంలో రూ.37,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ మహా ప్రాజెక్టు ద్వారా ఏకంగా 4,67,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భూసేకరణకు లైన్ క్లియర్ కావడంతో పాటు, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల పనులు ప్రారంభమయ్యాయి. ఈ సిటీకి చెన్నై, కృష్ణపట్నం పోర్టులు సమీపంలో ఉండటం, రేణిగుంట విమానాశ్రయం అందుబాటులో ఉండటం ప్రధాన బలంగా మారాయి.
క్రిస్ సిటీకి జాతీయ రహదారి, రైల్వే మార్గాలు అనుసంధానంగా ఉండటంతో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా మారింది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి, రైల్వే లైన్ ఈ ప్రాంతం గుండా వెళ్లడం వల్ల రవాణా సౌలభ్యం పెరుగుతుంది. ప్రభుత్వం 2026 ఫిబ్రవరి నాటికి మొదటి దశ పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సింహపురి ప్రాంతం పూర్తిగా పారిశ్రామిక హబ్‌గా రూపాంతరం చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలను జిల్లాలో కలపడం కూడా ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూర్చినట్లు చెబుతున్నారు.
ఈ క్రిస్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి 2017లోనే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (CBIC)లో భాగంగా ఈ ప్రాజెక్టును మూడు దశల్లో 10,834 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 2,500.49 ఎకరాలు సేకరించనుండగా, ఇందులో 985.604 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్న సుమారు 600 మంది రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం పరిహారాన్ని పెంచి భూసేకరణకు వేగం తీసుకొచ్చింది. రెండో దశలో 4,132.8 ఎకరాలు, మూడో దశలో 4,473 ఎకరాలు సేకరించనున్నారు.
మొత్తం సేకరించే భూమిలో 4,658.83 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించనుండగా, పర్యావరణ పరిరక్షణకు 1,202.62 ఎకరాలు, నివాసాల కోసం 1,310.97 ఎకరాలు కేటాయించనున్నారు. రూ.2,139.43 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టగా, ఇప్పటివరకు NICDIT రూ.531.36 కోట్లు విడుదల చేసింది. ప్రధాన వంతెనల నిర్మాణం, నీటి సరఫరా వ్యవస్థలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టుతో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి పరిశ్రమలు ఏర్పడతాయని, తద్వారా నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా దేశపటంలో నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.