ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిని వివరిస్తూనే, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆయన ఎండగట్టారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్ల పడుతున్న అదనపు భారం, పునరావాస ప్రక్రియ మరియు తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సఖ్యత గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని సీఎం ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, ఇప్పుడు కొత్తగా దీనిని నిర్మించడానికి అదనంగా రూ. 1,000 కోట్లు ఖర్చవుతున్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా దీనిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఫిబ్రవరి 15, 2026 నాటికి డయాఫ్రం వాల్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెయిన్ డ్యామ్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని బాబు పేర్కొన్నారు. పునరావాస ప్రక్రియలో మొదటి దశ పనులన్నీ మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామన్నారు. రెండో దశ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పోలవరం నీటిని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు తరలించే కాలువను బాగా వెడల్పు చేశామని, దీనివల్ల ఆ ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తాను తీసుకున్న కఠిన నిర్ణయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
"ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితేనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆనాడు కేంద్రానికి తెగేసి చెప్పాను. ఒకవేళ ఆ మండలాలు కలపకుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయ్యేది కాదు" అని ఆయన వివరించారు. రాయలసీమ నీటి కష్టాలను తీర్చడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎంతగా ఉపయోగపడిందో ఆయన గణాంకాలతో సహా వివరించారు.
పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు సకాలంలో నీరు అందిందని, అక్కడ మిగిలిన శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించగలిగామని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లివ్వడం వల్లే అనంతపురానికి కియా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థ వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాయలసీమ పండ్ల తోటలకు నిలయంగా మారిందని, దానిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో ఉన్న జలవివాదాల గురించి మాట్లాడుతూ ఆయన హితవు పలికారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉందని, పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెప్పడం సరికాదని కోరారు. హైదరాబాద్‌లో వారానికి ఒకసారి నీరు వచ్చే రోజుల్లో సాగర్ నుండి నీళ్లు తెచ్చి దాహార్తిని తీర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నేడు హైదరాబాద్ (Hyderabad) అత్యంత నివాసయోగ్య నగరంగా మారడంలో తాము చేసిన కృషి ఉందన్నారు. తెలుగుజాతి ఒక్కటేనని, ఇద్దరి మధ్య విరోధాలు పెంచి ఆనందించే పరిస్థితి రాకూడదని, భావోద్వేగాలతో ఆటలు ఆడకుండా 'ఇచ్చిపుచ్చుకునే ధోరణి'తో ఉండాలని కోరారు.