Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు, మహిళలను తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం ప్రముఖ నటి నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తూ అన్నా డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విల్లుపురంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎంపీ షణ్ముగం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరిని తప్పుబట్టారు. ఇటీవల సీఎం స్టాలిన్ ప్రజలను ఉద్దేశించి "మీ కలలను మాతో పంచుకోండి, వాటిని మేము నెరవేరుస్తాం" అని పిలుపునిచ్చారు. దీనిపై సెటైర్లు వేసే క్రమంలో ఎంపీ హద్దులు దాటారు.
కలల పేరుతో అనుచిత పోలిక
అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా కలలు కనమంటున్నారు. మరి నాకు నయనతారను కలవాలని ఉంది, నా కోరికను సీఎం తీరుస్తారా? ఎవరైనా నయనతారతో పెళ్లి చేయమని అడిగితే సీఎం చేస్తారా? అంటూ షణ్ముగం ఎద్దేవా చేశారు. మహిళా భద్రత గురించి పోరాటం చేస్తూ, అదే వేదికపై ఒక మహిళా నటిని కించపరిచేలా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మద్దతుగా నవ్విన నేతలు
ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఇతర అన్నాడీఎంకే నాయకులు ఆయన్ని వారించాల్సింది పోయి, గట్టిగా నవ్వుతూ మద్దతు తెలపడం గమనార్హం. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "మహిళల గౌరవం కోసం నిరసన చేస్తూ, ఒక మహిళా నటి వ్యక్తిత్వాన్ని కించపరచడం ఏంటని" ప్రశ్నిస్తున్నారు.
డీఎంకే ఘాటు స్పందన
ఎంపీ వ్యాఖ్యలపై అధికార డీఎంకే తీవ్ర స్థాయిలో మండిపడింది. పార్టీ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేయడం వేరని, కానీ ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. నయనతారపై చేసిన వ్యాఖ్యలు కేవలం ఆమె ఒక్కరినే కాకుండా, మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే అన్నాడీఎంకే నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితి
ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు కూడగట్టాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలు అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మహిళా ఓటర్లు కీలకమైన ఈ తరుణంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారాయి. ఇప్పటి వరకు ఈ వివాదంపై అటు అన్నాడీఎంకే అధిష్టానం గానీ, ఇటు నటి నయనతార గానీ అధికారికంగా స్పందించలేదు.