ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు అభివృద్ధి పథంలో ప్రస్తుత ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు గత ప్రభుత్వ లోపాలను చూపిస్తూనే, మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ, వ్యక్తిత్వ హననం సరికాదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. "ప్రభుత్వ సొమ్మును నా సొంత ఖర్చులకు వాడినట్లు సాక్షి (Sakshi) పత్రిక రాసిన కథనం పచ్చి అబద్ధం. దీనికి సంబంధించిన ఆధారాలను నేను ప్రజల ముందు ఉంచాను. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, ప్రభుత్వ సొమ్మును ఎప్పుడూ వ్యక్తిగత అవసరాలకు వినియోగించలేదు" అని ఆయన ఉద్ఘాటించారు.
సోషల్ మీడియా (Social Media) లో వేధింపులకు పాల్పడే వారిని, చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తప్పుడు రాతలపై పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. విశాఖ నగరాన్ని కేవలం పరిపాలనకే పరిమితం చేయకుండా, దానిని ఒక ఆర్థిక శక్తిగా మార్చడమే తమ లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
విశాఖకు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు మరియు స్టీల్ సిటీలు రాబోతున్నాయి. పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తూ, పెట్టుబడులు వస్తేనే మన యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆయన వివరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు.. జరగనివ్వం అని ఆయన ఘంటాపథంగా చెప్పారు.