రాష్ట్రంలో ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో కొన్ని కారణాల వల్ల కొంతమంది పోస్టులు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి. ఈ మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి 2026లో మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతేడాది కూటమి ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ తాజాగా మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించింది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలు విడుదల కాగా, త్వరలోనే తుది కీలతో పాటు టెట్ ఫలితాలను కూడా ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్న కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌పైనే నిలిచింది. నిజంగా మరో DSC నోటిఫికేషన్ వస్తుందా? వస్తే ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారన్న ప్రశ్నలకు నిరుద్యోగులు సమాధానాలు వెతుకుతున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 వేల మందికి పైగా ఉపాధ్యాయులు రిటైర్ కానున్నారు. దీనితో పాటు రాష్ట్రంలో 9,200 ప్రైమరీ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మారుస్తున్న నేపథ్యంలో అదనపు ఉపాధ్యాయుల అవసరం ఏర్పడినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ అవసరాలతో పాటు గత డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులు కలిపితే మొత్తం ఖాళీలు సుమారు 10 వేల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ మొత్తం ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తారా? లేక పరిమిత సంఖ్యలో పోస్టులతోనే సరిపెడతారా అన్నది నోటిఫికేషన్ వెలువడే వరకు స్పష్టత రావాల్సి ఉంది. అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి నెల రెండో వారంలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి డీఎస్సీ పరీక్ష విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని విద్యాశాఖ యోచిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అంశాలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇది ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టనున్న చర్యగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర విద్యాశాఖ మొత్తం విద్యా వ్యవస్థను సమగ్రంగా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. కేవలం ఖాళీల భర్తీతో సరిపెట్టకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడటం అత్యంత అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే రిటైర్మెంట్లు, కొత్త అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖాళీలను వేగంగా భర్తీ చేసే విధంగా విధాన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.