ఇండియన్ ఆర్మీలో చేరాలని కలలు కనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 2026 అక్టోబర్ నుంచి ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో శిక్షణ ప్రారంభమవుతుంది. జనవరి 7, 2026 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) 67 కోర్సు సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఎంఐఎస్సీ (Miscellaneous Engineering Streams) వంటి పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సు వ్యవధి ఒక సంవత్సరం. శిక్షణ పూర్తి చేసిన అనంతరం అభ్యర్థులను ఇండియన్ ఆర్మీలో అధికారులుగా విధుల్లోకి తీసుకుంటారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2026 అక్టోబర్ 1కి ముందు డిగ్రీ పూర్తి చేయనున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే.
ఫిజికల్ ఫిట్నెస్‌కు ఇండియన్ ఆర్మీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అభ్యర్థులు 10 నిమిషాల 30 సెకన్లలో 2.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేయాలి. అదనంగా కనీసం 40 పుష్-అప్స్, 6 పుల్-అప్స్, 30 సిట్-అప్స్ చేయగలగాలి. స్విమ్మింగ్‌లో ప్రాథమిక నైపుణ్యం ఉండటం తప్పనిసరి. ఈ కోర్సుకు కేవలం పురుష అభ్యర్థులకే అవకాశం కల్పించారు. మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ వర్తించదు.
అభ్యర్థుల వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1 అక్టోబర్ 1999 నుంచి 30 సెప్టెంబర్ 2006 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు ఉంది. వచ్చిన దరఖాస్తులను గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేసి, అనంతరం ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఈ కోర్సుకు రాత పరీక్ష లేకపోవడం విశేషం. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. ఆ తర్వాత అధికారిగా విధులు చేపట్టిన వారికి నెలకు గరిష్ఠంగా రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది. ఇండియన్ ఆర్మీలో గౌరవప్రదమైన కెరీర్ కోరుకునే యువతకు ఇది ఓ అరుదైన అవకాశంగా నిలవనుంది.