కాకినాడ (Kakinada) జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంగళవారం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి అనిత, ఇతర అధికారులు.. సీఎం చంద్రబాబుకి వివరించారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సీఎం సూచించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు నేడు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికీ కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని సూచించారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.
బాధితులకు అందే సాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కాగా.. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్థులంతా సరుకులు కొనేందుకు తుని పట్టణానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చే లోపు ఊరుమొత్తం మంటల్లో చిక్కుకుంది. ఊర్లో ఉన్న కొద్దిమంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు.
ఈ ప్రమాదంలో తండాలోని 38 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. అగ్నిప్రమాదంలో ఊర్లోని ప్రజలు సర్వ కోల్పోయి.. కట్టుబట్టలతో రోడ్డుపైన నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్లముందే ఇళ్లు కాలిపోవడంతో తండావాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.