నీట్ పీజీ (NEET PG) పరీక్షలో నెగటివ్ మార్కులు వచ్చినప్పటికీ మెడికల్ పీజీ (Medical PG) అడ్మిషన్లు పొందే అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు మెడికల్ పీజీ సీట్ల కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటుంటారు. అయితే ఇటీవల కొన్నేళ్లుగా అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా రిమోట్ ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు ఖాళీగా ఉండిపోతుండటం కేంద్రానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఖాళీ సీట్లను పూర్తిగా భర్తీ చేయాలనే ఉద్దేశంతో అర్హత పర్సంటైల్‌ను గణనీయంగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం జనరల్, EWS అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్‌ను 7కి తగ్గించారు. అలాగే PwBD అభ్యర్థులకు 5 పర్సంటైల్, SC/ST/OBC రిజర్వ్డ్ కేటగిరీలకు పూర్తిగా జీరో పర్సంటైల్‌గా నిర్ణయించారు. అంటే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు NEET PG పరీక్షలో మైనస్ 40 మార్కులు వచ్చినా పీజీ అడ్మిషన్ పొందే అవకాశం ఏర్పడింది. ఇది దేశ చరిత్రలో తొలిసారి ఇంత తక్కువ అర్హత ప్రమాణాలతో మెడికల్ పీజీ సీట్లు కేటాయించే పరిస్థితి రావడం గమనార్హం.
కేంద్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, ఖాళీగా ఉండే సీట్ల వల్ల మెడికల్ విద్యా వనరులు వృథా అవుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఇది అవసరమని వివరణ ఇచ్చింది. మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ, హాస్పిటల్ సదుపాయాలు ఉన్నప్పటికీ విద్యార్థులు లేకపోవడం వల్ల శిక్షణ వ్యవస్థ బలహీనపడుతోందని పేర్కొంది. అందుకే తాత్కాలిక చర్యగా అర్హత ప్రమాణాలను తగ్గించామని అధికారులు తెలిపారు.
అయితే ఈ నిర్ణయంపై వైద్య వర్గాలు, విద్యావేత్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెగటివ్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు కూడా పీజీ అడ్మిషన్లు ఇస్తే వైద్య విద్య ప్రమాణాలు దిగజారే ప్రమాదం ఉందని విమర్శిస్తున్నారు. పీజీ పూర్తిచేసే వైద్యుల నైపుణ్యం, రోగుల భద్రతపై ప్రభావం పడుతుందనే భయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ప్రతిభ ఆధారంగా సీట్లు దక్కాల్సిన విధానం బలహీనపడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
మరోవైపు, కొందరు విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. గ్రామీణ, పేద విద్యార్థులకు మెడికల్ పీజీ కల నెరవేరే అవకాశం పెరిగిందని వారు అంటున్నారు. గతంలో అధిక కటాఫ్‌ల వల్ల అనేక సీట్లు ఖాళీగానే ఉండిపోయేవని, ఇప్పుడు అవి పూర్తిగా వినియోగంలోకి వస్తాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి NEET PG అర్హత పర్సంటైల్ భారీగా తగ్గింపు నిర్ణయం మెడికల్ విద్య భవిష్యత్తుపై పెద్ద చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఖాళీ సీట్ల భర్తీ లక్ష్యం ఒకవైపు అవసరమే అయినప్పటికీ, వైద్య ప్రమాణాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవనుంది.