ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని స్పష్టమైన సూచనలతో కూడిన లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఇటీవల పీపీపీ విధానంపై జరుగుతున్న చర్చల మధ్య ఈ లేఖ రావడం రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ లేఖను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌కు పంపించారు. ఈ లేఖతో పాటు పీపీపీ మోడల్ అమలుకు సంబంధించిన 27 పేజీల సమగ్ర మార్గదర్శకాలను కూడా జత చేశారు. వైద్య సేవల డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న వసతులకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించాలంటే పీపీపీ విధానం ఎంతో ఉపయోగకరమని కేంద్రం అభిప్రాయపడింది. ప్రభుత్వ వసతులు, ప్రైవేట్ రంగ నైపుణ్యాన్ని కలిపి పనిచేస్తే తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది.
ముఖ్యంగా ఐదు రంగాల్లో పీపీపీ విధానాన్ని ప్రాధాన్యతతో అమలు చేయాలని కేంద్రం సూచించింది. న్యూక్లియర్ మెడిసిన్, మొబైల్ మెడికల్ యూనిట్లు, దంత వైద్య సేవలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఇందులో ఉన్నాయి. ఈ సేవలను Equip–Operate–Maintain లేదా Operate & Maintain మోడళ్లలో అమలు చేయవచ్చని తెలిపింది. ప్రైవేట్ భాగస్వామ్యానికి ఐదు నుంచి పది సంవత్సరాల కాలపరిమితితో ఒప్పందాలు కుదుర్చుకుని, పనితీరు ఆధారంగా చెల్లింపులు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
న్యూక్లియర్ మెడిసిన్ విషయంలో కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. క్యాన్సర్, గుండె, నరాల సంబంధిత వ్యాధుల నిర్ధారణకు ఇది అత్యంత అవసరమని, కానీ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు దాదాపుగా లేవని పేర్కొంది. PET-CT, SPECT వంటి ఆధునిక ఇమేజింగ్ సేవలను రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే పీపీపీ విధానం సరైన మార్గమని తెలిపింది. అలాగే రేడియాలజీ సేవల విస్తరణ ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
దంత వైద్య సేవల విషయంలో కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు దంత సమస్యలతో బాధపడుతున్నా, ప్రాథమిక స్థాయిలో సరైన సేవలు అందడం లేదని తెలిపింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీపీపీ ద్వారా దంత వైద్య సేవలను బలోపేతం చేయాలని సూచించింది. అవసరమైన పరికరాలు, నిపుణుల కొరతను ఈ విధానంతో తగ్గించవచ్చని పేర్కొంది.
క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన డే కేర్ సెంటర్లపై కూడా కేంద్రం స్పష్టమైన లక్ష్యాలను వెల్లడించింది. 2027–28 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో 2025–26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 14 క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంజూరు చేసినట్లు లేఖలో పేర్కొంది. ముందస్తు స్క్రీనింగ్, తక్కువ ఖర్చుతో చికిత్స అందించడంలో ఇవి కీలకంగా మారతాయని కేంద్రం అభిప్రాయపడింది.
పీపీపీ విధానాన్ని ఆరోగ్య రంగంలో సమర్థంగా అమలు చేస్తే ప్రజలకు నాణ్యమైన సేవలు చేరువవుతాయని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సూచనలను ఎలా అమలు చేస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రజారోగ్య రంగంలో ఈ నిర్ణయం కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.