దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ చేసే సమయంలో వసూలు చేసే ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా SBI కాని ఇతర బ్యాంకుల ఏటీఎంలను తరచుగా ఉపయోగించే కస్టమర్లపై ఈ నిర్ణయం ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది. ఇటీవల పెరిగిన ఇంటర్చేంజ్ ఫీజుల కారణంగా ఈ ఛార్జీలను సవరించాల్సి వచ్చిందని SBI వెల్లడించింది.
ATMలు, ADWMలు (ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్‌డ్రాయల్ మెషీన్లు) ద్వారా జరిగే లావాదేవీలపై బ్యాంకులకు వచ్చే ఖర్చు పెరగడంతో ఆ భారాన్ని కస్టమర్లపైకి మళ్లించింది. సాధారణ సేవింగ్స్ ఖాతాదారుల విషయంలో ఉచిత లావాదేవీల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని SBI స్పష్టం చేసింది. నెలకు ఐదు ఉచిత లావాదేవీల సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఈ ఉచిత పరిమితి పూర్తయిన తర్వాత నగదు ఉపసంహరణకు ఇప్పుడు రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.21 మాత్రమే. అలాగే బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలకు కూడా ఛార్జీలు పెరిగాయి.
ఇలాంటి లావాదేవీలకు ఇప్పుడు రూ.11 + జీఎస్టీ వసూలు చేస్తారు, ఇది గతంలో రూ.10గా ఉండేది. ఈ మార్పులు సాలరీ అకౌంట్ కలిగిన కస్టమర్లకు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు SBI కాని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలు పొందిన సాలరీ ఖాతాదారులకు ఇక ఆ సదుపాయం ఉండదు. కొత్త నిబంధనల ప్రకారం నెలకు మొత్తం 10 ఉచిత లావాదేవీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. వీటిలో నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ చెక్‌లు రెండూ కలుపుకుని లెక్కిస్తారు. ఈ పరిమితి దాటిన తర్వాత మిగతా కస్టమర్లకు వర్తించే పెరిగిన ఛార్జీలే సాలరీ ఖాతాదారులకు కూడా వర్తిస్తాయి.
అయితే కొన్ని కేటగిరీల కస్టమర్లకు మాత్రం ఈ నిర్ణయం నుంచి ఉపశమనం లభించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులపై కొత్త ఛార్జీలు విధించలేదు. అలాగే SBI డెబిట్ కార్డుతో SBI ఏటీఎంలలో లావాదేవీలు చేసే వారికి పాత నిబంధనలే కొనసాగుతాయి. తరచుగా ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే కస్టమర్లు అదనపు ఛార్జీలను తప్పించుకోవాలంటే SBI ఏటీఎంలను ఎక్కువగా వినియోగించడం లేదా ఉచిత లావాదేవీల పరిమితిలోనే నగదు ఉపసంహరణలు పూర్తి చేయడం మంచిదని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.