థాయ్‌లాండ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కొత్త visa — "డెస్టినేషన్ థాయ్‌లాండ్ వీసా (DTV)" — యూఏఈలో నివసించే వారిలో ఆసక్తిని రేపుతోంది. జూలై 2024లో ప్రవేశపెట్టిన ఈ visa కు ఇప్పటివరకు 35,000 మంది దరఖాస్తు చేశారు. ఇది ముఖ్యంగా remote work చేస్తున్న వాళ్ల కోసం రూపొందించబడింది. దీనిద్వారా ఉద్యోగులు వారి కంపెనీ దేశంలో నుంచే పని చేస్తూ థాయ్‌లాండ్‌లో ఉంటూ జీవించవచ్చు.
ఈ వీసా 5 సంవత్సరాల కాలానికి గడువు కలిగి ఉంటుంది. ఒకేసారి 180 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండే అవకాశం లభిస్తుంది. ఈ గడువును మరో 180 రోజులకు పొడిగించుకోవచ్చు. భార్య మరియు పిల్లలను కూడా ఈ వీసా ద్వారా తీసుకెళ్లే వీలుంది, కాబట్టి కుటుంబంగా వెళ్లాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. వీసా కలిగినవారు మోయ్ థాయ్ (కుస్తీ), వంట తరగతులు, థాయ్ భాష కోర్సులు లాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.
థాయ్‌లాండ్‌లో జీవన ఖర్చులు యూఏఈతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఫుకెట్, చియాంగ్ మై, బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో అందమైన వాతావరణం, వేగవంతమైన ఇంటర్నెట్, వైద్య సేవలు మరియు గల్ఫ్ దేశాలతో నేరుగా విమాన సౌకర్యం ఉండటం వలన యూఏఈ ఉద్యోగులకు ఇది మంచి ఎంపికగా మారింది. ఇటీవలి సంవత్సరంలో మిడిల్ ఈస్ట్ దేశాల నుండి 9 లక్షల మందికిపైగా థాయ్‌లాండ్‌కి వెళ్లగా, ఈ ఏడాది లక్ష్యం ఒక మిలియన్‌కి పైగా అని టూరిజం అథారిటీ తెలిపింది.
అయితే కొంతమంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఒక చిన్న సమస్య ఏంటంటే – ఎక్కువ థాయ్‌లాండ్ బ్యాంకులు ఈ వీసా కలిగిన వారికి లోకల్ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడానికి అనుమతించడంలేదు. ఇది అక్కడ QR కోడ్ పేమెంట్ లాంటి డిజిటల్ లావాదేవీలకు అడ్డుపడుతుంది. అయినా కూడా ఈ వీసా వల్ల లభించే స్వేచ్ఛ, జీవనశైలి, తక్కువ ఖర్చులు చూసి చాలా మంది దీన్ని ఒక శాశ్వత మార్గంగా అనుసరిస్తున్నారు.