హైదరాబాద్–విజయవాడ రూట్‌లో ఇప్పటికే విమాన సర్వీసులు ఉన్నప్పటికీ, భారీ టికెట్ ధరలు, సీట్ల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు టికెట్ ధరలు రూ.18 వేల దాకా ఉండగా, మరోవైపు సీట్లు దొరకకపోవడంతో ప్రయాణ ప్రణాళికలు గందరగోళానికి గురవుతున్నాయి. ఈ సమస్యలన్నింటిని పరిగణనలోకి తీసుకుని, టీడీపీ ఎంపీలు ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి వినతిపత్రం సమర్పించారు. విమానాల సంఖ్య పెంచాలని, చిన్న విమానాల స్థానంలో పెద్దవాటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్ 4) ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇండిగో ఫ్లైట్ స్పెషల్ డైరెక్టర్ ఏకే సింగ్, ఎంపీ జీఎం హరీష్‌ల మధ్య కీలక భేటీ జరిగింది. విజయవాడ–హైదరాబాద్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న చిన్న ఏటీఆర్ విమానాల్లో టికెట్ ఛార్జీలు ఎక్కువగా పడుతున్నాయని, సీట్లు తక్కువగా ఉండటం వల్ల డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరుగుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు ఏకే సింగ్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ప్రయాణికులు ఎదుర్కొంటున్న లగేజీ పరిమితి సమస్యలను కూడా వివరించారు.
ఈ అంశాలన్నింటిని పరిశీలించిన ఇండిగో డైరెక్టర్ ఏకే సింగ్ సానుకూలంగా స్పందించారు. వచ్చే 10 రోజుల్లోనే విజయవాడ–హైదరాబాద్ రూట్‌లో వైడ్ బాడీ విమానాల సర్వీసులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. పెద్ద విమానాలు నడపడం వల్ల మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయనీ, దాంతో టికెట్ ధరలు సహజంగానే తగ్గుతాయని ఏకే సింగ్ తెలిపారు. లగేజ్ పరిమితి కూడా పెరగడం వల్ల ప్రయాణికులకు అదనపు సౌలభ్యం కలుగుతుందని చెప్పారు.
ఇదే భేటీలో ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి మేరకు విజయవాడ నుంచి వారణాసి, అహ్మదాబాద్, పుణే, కొచ్చిన్, గోవా రూట్ల కోసం రూట్ మ్యాపింగ్ సిద్ధం చేస్తామని ఇండిగో వెల్లడించింది. వారణాసి–కొచ్చిన్ మధ్య కొత్త విమాన సర్వీసులు త్వరగా ప్రారంభించాలని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. ఇటీవలి నెలల్లో విశాఖపట్నం–హైదరాబాద్ రూట్‌లో కూడా ఇదే తరహా సమస్యలు రావడంతో, అక్కడ కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకుని పరిష్కారం తీసుకువచ్చారు. ఇప్పుడు విజయవాడ–హైదరాబాదు రూట్‌కు వైడ్ బాడీ విమానాలు చేరడంతో, ప్రయాణికులకు చివరకు ఉపశమనం లభించనుంది.