One Plus: వన్‌ప్లస్‌లో భారీ మార్పులు.. అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి వైదొలుగుతున్న కంపెనీ!

One Plus: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కంపెనీ ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన OxygenOSకు త్వరలో వీడ్కోలు పలకనుంది. ఇకపై వన్‌ప్లస్ ఫోన్లన్నీ మాతృసంస్థ ఒప్పో అభివృద్ధి చేసిన ColorOS తోనే పనిచేయనున్నాయి. ఇదే సమయంలో అమెరికా, యూరప్ మార్కెట్లలో కొత్త ఉత్పత్తుల విడుదలను నిలిపివేస్తున్నట్లు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

One Plus
One Plus

OxygenOSకు గుడ్‌బై చెప్పిన వన్‌ప్లస్.. ColorOS 17తో కొత్త అధ్యాయం..

అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్ నిష్క్రమణ.. భారత్‌లో సేవలు యథావిధి..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) కీలక నిర్ణయాలను ప్రకటించింది. కంపెనీ ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన OxygenOSకు త్వరలో వీడ్కోలు పలకనుంది. ఇకపై వన్‌ప్లస్ ఫోన్లన్నీ మాతృసంస్థ ఒప్పో (Oppo) అభివృద్ధి చేసిన ColorOSతోనే పనిచేయనున్నాయి. ఇదే సమయంలో అమెరికా, యూరప్ మార్కెట్లలో కొత్త ఉత్పత్తుల విడుదలను నిలిపివేస్తున్నట్లు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

ఈ ప్రకటనలను వన్‌ప్లస్ ఇండియా, అమెరికా, యూరప్ విభాగాల అధికారులు తమ కమ్యూనిటీ ఫోరమ్‌ల ద్వారా వెల్లడించారు. ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ బ్రాండ్ల వ్యాపార పునర్వ్యవస్థీకరణ జరుగుతోందనే వార్తల మధ్య ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వన్‌ప్లస్ తెలిపిన వివరాల ప్రకారం, Android 17 ఆధారంగా వచ్చే ColorOS 17తో కొత్త దశ ప్రారంభం కానుంది. భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ColorOS 17తోనే అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం వన్‌ప్లస్ ఫోన్లు ఉపయోగిస్తున్న వినియోగదారుల్లో భవిష్యత్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లకు అర్హత ఉన్న డివైస్‌లకు కూడా స్వచ్ఛందంగా ColorOS 17కు మారే అవకాశం కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.

సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని ఒకే వేదికపైకి తీసుకురావడం, వేగంగా అప్‌డేట్‌లు అందించడం, మరింత స్థిరమైన, విశ్వసనీయమైన వినియోగ అనుభవాన్ని అందించడమే ఈ మార్పు వెనుక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది.

వన్‌ప్లస్ వెల్లడించిన సమాచారం ప్రకారం, 2021 నుంచే OxygenOS, ColorOS రెండూ ఒకే కోడ్‌బేస్‌పై అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే చైనాలో విక్రయిస్తున్న వన్‌ప్లస్ ఫోన్లు ColorOSనే ఉపయోగిస్తున్నాయి. ఇదే మార్గంలో వన్‌ప్లస్ సోదర సంస్థ రియల్‌మీ (Realme) కూడా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో కొత్త రియల్‌మీ ఫోన్లు కూడా ColorOS 17తోనే విడుదల కానున్నాయి.

వన్‌ప్లస్ మరో కీలక నిర్ణయం కూడా ప్రకటించింది. అమెరికా (North America), యూరప్ మార్కెట్లలో కొత్త వన్‌ప్లస్ ఉత్పత్తులను ఇకపై విడుదల చేయబోమని స్పష్టం చేసింది. గ్లోబల్ వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

అయితే ఇప్పటికే ఈ ప్రాంతాల్లో వన్‌ప్లస్ ఫోన్లు ఉపయోగిస్తున్న వినియోగదారులకు వారంటీ, అమ్మకాల అనంతర సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. మిగిలి ఉన్న స్టాక్‌ను విక్రయిస్తూనే ఉంటామని కూడా వెల్లడించింది.

కొన్ని రోజులుగా వన్‌ప్లస్ భారత్ నుంచి కూడా నిష్క్రమించబోతోందనే ప్రచారం జరిగినప్పటికీ, కంపెనీ ఆ వార్తలను ఖండించింది. భారత్ తమకు అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటని స్పష్టం చేసింది.

"వన్‌ప్లస్ ఇండియా కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. స్థానిక వ్యాపారం సాధారణంగానే సాగుతోంది. ధృవీకరించని వార్తలను ప్రచారం చేయకుండా మీడియా బాధ్యతగా వ్యవహరించాలి" అని కంపెనీ ప్రకటనలో పేర్కొంది.

ఇటీవలి నెలల్లో నాలుగు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్‌లో విడుదల చేసినట్లు, త్వరలో OnePlus N6x స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించింది. అలాగే వినియోగదారులకు ఒప్పో సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా అమ్మకాల అనంతర సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.

స్మార్ట్‌ఫోన్ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒప్పో గ్రూప్ తన అనుబంధ బ్రాండ్ల సాఫ్ట్‌వేర్, మార్కెట్ వ్యూహాలను ఒకే దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో OxygenOSకు ముగింపు పలకడం, అమెరికా-యూరప్ మార్కెట్లలో కొత్త ఉత్పత్తులను నిలిపివేయడం వంటి నిర్ణయాలు భవిష్యత్ వ్యాపార వ్యూహంలో భాగంగా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే భారత్, చైనా వంటి కీలక మార్కెట్లపై కంపెనీ ప్రత్యేక దృష్టి కొనసాగించనున్నట్లు తాజా ప్రకటనలతో స్పష్టమైంది.

Be the first to react

Latest