బేసిల్ (భూతులసి) కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఔషధ గుణాలున్న మొక్క. దీనిలో లభించే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిజ్జాలలో ఈ ఆకులను తరచూ చూస్తుంటాం. పిజ్జాకు ప్రత్యేకమైన సువాసన, రుచిని అందించడంలో బాసిల్ ఆకుల పాత్ర చాలా ముఖ్యమైనది.
అసలు ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఏలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిల్ లో విటమిన్ K అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, రక్తం సరిగ్గా గడ్డకట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ A కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ C మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గాయాలు త్వరగా మానడానికి దోహదపడుతుంది.
బేసిల్ ఆకుల్లో శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఐరన్ రక్తహీనతను తగ్గించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. కాల్షియం ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
బేసిల్ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని వాపు తగ్గుతుంది. ఇందులో ఉన్న అడాప్టోజెన్ గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికీ ఇది ఉపయోగకరం. బేసిల్ లోని యాంటీబాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే ఆయుర్వేదంలో దీనిని ఒక ముఖ్యమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. పిజ్జా లేదా సలాడ్లలో మాత్రమే కాకుండా, బాసిల్ ఆకులను నీటిలో మరిగించి టీలా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.