ఓటమి మరిచి పోలేకపోతున్నా.. కానీ పోరాటం ఆగదు! పీవీ సింధు భావోద్వేగ పోస్ట్..
Asian Games 2026: ఓటమి మిగిల్చిన బాధ అంత త్వరగా మాయమయ్యేది కాదు. ముఖ్యంగా గెలుపు అంచుల వరకు వెళ్లి చేజారిన మ్యాచ్ అయితే.. ఆ జ్ఞాపకాలు మరింత వెంటాడుతాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రస్తుతం అలాంటి బాధలోనే ఉంది. ఆసియా క్రీడల్లో తన ప్రయాణం క్వార్టర్ ఫైనల్‌తో ముగిసిన తర్వాత.. ఆ ఓటమిపై మరోసారి స్పందించిన సింధు తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది.
- ఆసియా గేమ్స్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చెన్ యుఫీ చేతిలో పీవీ సింధు ఓటమి.
- మ్యాచ్‌లో కీలక దశలో కోల్పోయిన మూడు పాయింట్లు ఇంకా వెంటాడుతున్నాయని సింధు వెల్లడి.
Asian Games 2026: ఓటమి మిగిల్చిన బాధ అంత త్వరగా మాయమయ్యేది కాదు. ముఖ్యంగా గెలుపు అంచుల వరకు వెళ్లి చేజారిన మ్యాచ్ అయితే.. ఆ జ్ఞాపకాలు మరింత వెంటాడుతాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రస్తుతం అలాంటి బాధలోనే ఉంది. ఆసియా క్రీడల్లో తన ప్రయాణం క్వార్టర్ ఫైనల్‌తో ముగిసిన తర్వాత.. ఆ ఓటమిపై మరోసారి స్పందించిన సింధు తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది.
చైనా స్టార్ చెన్ యుఫీతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సింధు పోరాడి ఓడింది. అయితే మ్యాచ్‌ను ముగించే అవకాశం తన చేతుల్లోకి వచ్చిన సమయంలో కోల్పోయిన ఆ మూడు పాయింట్లు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని ఆమె చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అదే విషయాన్ని పదేపదే ఆలోచిస్తున్నానని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
‘వీడియో రివ్యూ ఉంటే..?’
సింధు ఆవేదనలో మరో అంశం కూడా ఉంది. ఆసియా క్రీడలు వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో కీలకమైన మ్యాచ్‌లకు వీడియో రిఫరల్ సదుపాయం అందుబాటులో లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా రెండో గేమ్‌లో తనకు అనుకూలంగా రావాల్సిన కొన్ని లైన్ కాల్స్ ప్రతికూలంగా వెళ్లాయని పేర్కొంది.
‘ఆ సమయంలో వీడియో రివ్యూ అవకాశం ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేదేమో’ అన్న భావనను సింధు వ్యక్తం చేసింది. అయితే ఓటమికి పూర్తిగా వాటినే కారణంగా చూపకుండా.. తన ఆటను కూడా సమీక్షించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. శరీరంపై తీవ్ర ప్రభావం
మరోవైపు మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా తనపై ప్రభావం చూపిందని సింధు తెలిపింది. కేవలం 18 గంటల వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో శరీరానికి తగినంత విశ్రాంతి దొరకలేదని చెప్పింది. దాని ప్రభావం చివరి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించిందని పేర్కొంది.
తీవ్రమైన మ్యాచ్‌ల మధ్య తక్కువ వ్యవధిలోనే తిరిగి కోర్టులోకి రావాల్సి రావడం వల్ల శారీరకంగా ఇబ్బంది ఎదురైందని సింధు వివరించింది.
‘ఒక్క ఓటమి.. నా ప్రయాణాన్ని నిర్వచించదు’
అయితే.. ఈ ఓటమితో తన కథ ముగిసిపోలేదని సింధు స్పష్టం చేసింది. 2014లో తొలి ఆసియా క్రీడల నుంచి ఇప్పటి వరకు.. 12 ఏళ్లుగా భారత జెర్సీ కోసం తన సర్వస్వం ధారపోశానని గుర్తుచేసుకుంది.
నాలుగు ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణమని పేర్కొంది. అందుకే ప్రస్తుతం ఎదురైన బాధను కూడా తాను అనుభవించాల్సిందేనని చెప్పింది. కానీ ఒక్క బాధాకరమైన ఫలితం తన మొత్తం ప్రయాణానికి నిర్వచనం కాదని తేల్చిచెప్పింది.
బాధ ఉంది.. కానీ పోరాటం ఆగదు
ప్రస్తుతం తన టీమ్‌తో కలిసి మ్యాచ్‌లో జరిగిన తప్పులను సమీక్షిస్తున్నానని సింధు తెలిపింది. ఎక్కడ పొరపాట్లు జరిగాయో గుర్తించి.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతానని పేర్కొంది.