భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లో వచ్చే ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. అదే ఉత్సాహం ఇప్పుడు 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మరోసారి కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ముందే సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల రెండో విడత అమ్మకాలు ప్రారంభమైన వెంటనే, అభిమానుల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టమైంది.
జనవరి 14 సాయంత్రం 7 గంటలకు అధికారిక టికెటింగ్ బుక్‌మైషో ద్వారా టికెట్లు అమ్మకానికి రావడంతో, లక్షలాది మంది ఒక్కసారిగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఊహించిన దానికంటే ఎక్కువ ట్రాఫిక్ రావడంతో సర్వర్లు డౌన్ అయ్యాయి . ఫలితంగా కొద్ది నిమిషాల్లోనే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ పూర్తిగా క్రాష్ అయింది. చాలా మంది అభిమానులకు టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాలేదు. కొందరికి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చూపించగా, మరికొందరికి టెక్నికల్ ఎర్రర్ మెసేజ్‌లు కనిపించాయి.
భారత్–పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది మరో ఉదాహరణగా మారింది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, క్రికెట్ విషయానికి వచ్చేసరికి అభిమానుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే చాలు, స్టేడియంలు నిండిపోవడం ఖాయం. కొలంబో ప్రేమదాస స్టేడియం కూడా ఫిబ్రవరి 15న అభిమానుల హోరుతో మార్మోగనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈసారి ఐసీసీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను కూడా అందుబాటులో ఉంచారు. భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచే ప్రారంభమవుతున్నాయి. శ్రీలంకలో నిర్వహించే మ్యాచ్‌లకు టికెట్లు అక్కడి కరెన్సీ ప్రకారం LKR 1000 నుంచి అందుబాటులో ఉన్నాయి. భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రారంభ టికెట్ ధరను సుమారు LKR 1500గా నిర్ణయించారు. భారత రూపాయల్లో చూస్తే ఇది సుమారు రూ.430 వరకు ఉంటుంది.
భారత జట్టు ఈ ప్రపంచకప్‌లో గ్రూప్–ఏలో పోటీ పడనుంది. ఫిబ్రవరి 7న అమెరికాతో ముంబైలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో కొలంబోలో కీలక మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.
మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. భారత్, శ్రీలంకలోని ఎనిమిది ప్రధాన నగరాలు ఈ మెగా టోర్నీకి వేదికలుగా మారనున్నాయి. ఇప్పటికే ప్రపంచకప్ వాతావరణం మొదలైందని చెప్పవచ్చు. టికెట్ల కోసం జరిగిన వెబ్‌సైట్ క్రాష్ చూస్తే, ఈసారి ప్రపంచకప్‌పై అభిమానుల్లో ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. భారత్–పాక్ మ్యాచ్ రోజు దగ్గరపడే కొద్దీ ఈ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.