సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్ వైపు ప్రయాణాలు మళ్లీ ఊపందుకున్నాయి. వారం రోజుల పాటు సొంతూళ్లలో పండుగ సంబరాల్లో గడిపిన ప్రజలు తిరిగి ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం హైదరాబాద్‌కు బయలుదేరడంతో ప్రధాన రహదారులు, బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లలో తీవ్ర రద్దీ నెలకొంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ట్రాఫిక్ మందగించింది.
నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతంలో రద్దీ అత్యధికంగా కనిపిస్తోంది. వేల సంఖ్యలో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌ను సజావుగా నడిపేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిట్యాల వద్ద వాహనాలను కుడివైపు సింగిల్ రోడ్డులో భూవనగిరి మీదుగా హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నారు. వాహనాల సంఖ్య పెరిగినా ఎలాంటి ప్రమాదాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల సహాయంతో ట్రాఫిక్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. సోమవారం కూడా ఇదే స్థాయిలో వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఆదివారం అమావాస్య కావడంతో చాలామంది ప్రయాణాన్ని వాయిదా వేసుకొని సోమవారం బయలుదేరేందుకు మొగ్గు చూపారు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా చిట్యాల, పెద్దకాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉండటంతో పోలీసులు ముందస్తుగా డైవర్షన్లు అమలు చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా మళ్లించాలని సూచించారు. అలాగే మాచర్ల నుంచి వచ్చే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి మార్గంలో వెళ్లాలని సూచనలు జారీ చేశారు.
ఇక విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో విజిబిలిటీ తగ్గడంతో ప్రమాదాల ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు ఆన్ చేసి ప్రయాణించాలని, హైస్పీడ్‌లో ఓవర్‌టేక్ చేయవద్దని సూచిస్తున్నారు. మొత్తం మీద సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణాలు భారీగా పెరగడంతో రహదారులపై అప్రమత్తత తప్పనిసరిగా మారింది.