బంగ్లాదేశ్‌లో (Bangladesh) మత ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మక ఘటనకు దారి తీశాయి. అరటి పండ్ల విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు ఓ హిందూ వ్యాపారి (banana Merchant) ప్రాణాలను తీసిన విషాద ఘటనగా మారింది. బంగ్లాదేశ్‌లోని ఘాజీపూర్ ప్రాంతంలో లిటన్ చంద్ర ఘోష్ (55) అనే హిందూ వ్యక్తి చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్న ఆయనకు ఎవరితోనూ పెద్ద విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే సమీప గ్రామానికి చెందిన మాసుమ్ మియా అనే వ్యక్తికి అరటి తోట ఉంది. ఇటీవల తన తోటలోని అరటి పండ్లు కొంతమేర దొంగతనానికి గురయ్యాయని మాసుమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం వెనుక ఎవరో ఉన్నారనే అనుమానంతో పరిసర ప్రాంతాల్లో విచారణ ప్రారంభించాడు.
ఈ క్రమంలో లిటన్ చంద్ర ఘోష్ హోటల్ వద్ద అరటి పండ్లు కనిపించడంతో మాసుమ్‌కు అనుమానం మరింత బలపడింది. వెంటనే మాసుమ్ తన తల్లిదండ్రులు స్వాపన్, మాజేదాలతో కలిసి హోటల్‌కు వచ్చి లిటన్‌ను ప్రశ్నించాడు. అరటి పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడగగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మొదట మాటలకే పరిమితమైన వివాదం క్రమంగా హింసాత్మకంగా మారింది. కోపంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో లిటన్ చంద్ర ఘోష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మైనారిటీ హిందూ సమాజంలో భయాందోళనలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లిటన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మాసుమ్ మియా, అతని తల్లిదండ్రులు స్వాపన్, మాజేదాలను పోలీసులు అరెస్టు చేశారు. ‘అరటి పండ్ల దొంగతనం అనుమానంతో జరిగిన వాగ్వాదమే ఈ హత్యకు కారణం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు తెలిపారు.
ఇక ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు లిటన్ కుటుంబసభ్యులు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారడంపై స్థానికులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి బంగ్లాదేశ్‌లో సామాజిక సహనం, చట్టపరమైన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మతభేదాలు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.