అమెరికా నగరమైన న్యూయార్క్‌లో మేయర్ ఎన్నికల ఫలితాలు రాజకీయ చర్చలకు దారితీశాయి. నగరానికి కొత్తగా ఎన్నికైన మేయర్ జోహ్రాన్ మమ్దానీ — ఉగాండాలో జన్మించి, దక్షిణాసియా మూలాలున్న మొదటి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అయితే ఆయన గెలుపు తర్వాత ప్రకటించిన విధానాలు ముఖ్యంగా అద్దె నియంత్రణలు, ఉచిత రవాణా, ప్రజలకు ఉచిత చైల్డ్ కేర్ సెంటర్లు ప్రారంభించాలనే నిర్ణయం వ్యాపార వర్గాలను తీవ్రంగా ఆందోళనకు గురి చేశాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో పేరుగాంచిన బిలియనీర్ బ్యారీ స్టెర్న్‌లిట్ ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఆయన హెచ్చరిస్తూ, ఈ విధానాలు కొనసాగితే న్యూయార్క్ నగరం ముంబైలా మారిపోతుంది. ఇది నగర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు అవుతుంది అని చెప్పారు. స్టెర్న్‌లిట్ స్టార్‌వుడ్ క్యాపిటల్ గ్రూప్ అనే బిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ కంపెనీకి వ్యవస్థాపకుడు. ఆయన కంపెనీకి న్యూయార్క్‌లో వాణిజ్య, నివాస సముదాయాలపై భారీ పెట్టుబడులు ఉన్నాయి.
అమెరికా బిజినెస్ చానల్ CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెర్న్‌లిట్ మాట్లాడుతూ న్యూయార్క్‌లో ఏ నిర్మాణ ప్రాజెక్ట్‌కైనా కనీసం 100 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ప్రతి ప్రాజెక్ట్ యూనియన్ లేబర్ కాంట్రాక్ట్ కింద ఉండాలి. దీని వల్ల నిర్మాణ ఖర్చులు భయంకరంగా పెరిగిపోయాయి అని అన్నారు.
మమ్దానీ గెలుపు తర్వాత చేసిన వాగ్దానాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఆయన అద్దెను నిలిపివేసే నిర్ణయం ప్రజలకు ఉచిత బస్ సర్వీసులు 6 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఉచిత చైల్డ్ కేర్ సెంటర్లు, అలాగే ప్రతి బరోలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాసరీ దుకాణాలు ప్రారంభించాలని హామీ ఇచ్చారు. ఈ చర్యలు సాధారణ వర్గానికి ఉపశమనంగా కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం వీటిని “ఆర్థిక ప్రమాదం”గా పరిగణిస్తున్నారు.
స్టెర్న్‌లిట్ మాట్లాడుతూ, “ఎడమ వైపు ఆలోచించే నేతలు అద్దెదారులపై ఒత్తిడి చేయరాదని చెబుతారు. కానీ అద్దె చెల్లించకపోయినా వారిని ఖాళీ చేయించలేకపోతే ఇంకో అద్దెదారు కూడా చెల్లించడు. ఇలా ఒక్కొక్కరిగా చెల్లింపులు ఆగిపోతే, మొత్తం నగరంలో అద్దె వ్యవస్థ కూలిపోతుంది.
అయితే ఆయన మాటల్లో పూర్తిగా నిరుత్సాహం మాత్రమే లేదని, మమ్దానీ కూడా నగరంలోని “మూల సమస్యలపై” దృష్టి పెట్టారని పేర్కొన్నారు. “నగరంలో ఇళ్ల కొరత నిజంగా ఉంది. దానిని పరిష్కరించాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి. యూనియన్లు తమ పనితీరును కొంచెం సడలించాలి. లేనిపక్షంలో నగర అభివృద్ధి ఆగిపోతుంది” అని ఆయన అన్నారు.
పోలీసు శాఖకు నిధులు తగ్గించాలని మమ్దానీ గతంలో చెప్పిన వ్యాఖ్యలను కూడా స్టెర్న్‌లిట్ ప్రస్తావించారు. ప్రజలు తమ పిల్లలు రోడ్డుపై సురక్షితంగా లేరని అనుకుంటే, వారు నగరాన్ని వదిలి వెళ్తారు. పోలీస్‌లకు గౌరవం ఇవ్వకపోతే ప్రజా భద్రత దెబ్బతింటుంది. అప్పుడు న్యూయార్క్ తన కీర్తిని కోల్పోతుంది అని హెచ్చరించారు. ఆయన కంపెనీ ఇప్పటికే మిడ్‌టౌన్ మాన్‌హాటన్ ఆఫీసును వేరే రాష్ట్రానికి తరలించే ఆలోచనలో ఉందని కూడా వెల్లడించారు.
మమ్దానీ మరోవైపు తన విజన్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికీ ఇల్లు, భద్రత, గౌరవం లభించాలి. ఇది కేవలం విధానం కాదు, న్యాయం కోసం చేస్తున్న పోరాటం అని ఆయన ప్రజలకు చెప్పారు. న్యూయార్క్ వంటి బహుళసాంస్కృతిక నగరంలో ఈ విధానం చర్చకు దారితీసింది. కొందరు దీన్ని సామాజిక న్యాయం దిశగా ముందడుగుగా చూస్తుంటే, మరికొందరు ఆర్థిక విపత్తుకు నాంది అంటున్నారు.
ఏది ఏమైనా, జోహ్రాన్ మమ్దానీ మేయర్‌గా న్యూయార్క్ పాలనను చేపట్టిన తర్వాత నగర ఆర్థిక దిశ, ప్రజా భద్రత, హౌసింగ్ విధానాలపై ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలో ఉండనున్నాయి. ముంబైలా మారుతుందా, లేక కొత్త దిశలో అభివృద్ధి చెందుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే నెలల్లో తెలుస్తుంది