ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పదోన్నతుల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై అధికారుల ప్రమోషన్లకు కేవలం మెరిట్ రేటింగ్ రిపోర్టులు (MRR) మాత్రమే కాకుండా, వార్షిక రహస్య నివేదికలు (ACR) కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మార్పులు 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి దశలవారీగా అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో పదోన్నతుల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీలో అధికారుల పదోన్నతులు ప్రధానంగా MRR ఆధారంగానే జరిగేవి. అయితే, ఆర్టీసీ కూడా ప్రభుత్వ విభాగంలో భాగమే కావడంతో, ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఇక్కడ కూడా ACR విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (DPC) అధికారుల పనితీరును మరింత సమగ్రంగా అంచనా వేయనుంది.
కొత్త నిబంధనల ప్రకారం మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులకు ఈ విధానం వర్తిస్తుంది. వరుసగా నాలుగు ప్యానెల్ ఇయర్స్‌లో అధికారుల MRR, ACR రెండింటినీ కలిపి పరిశీలిస్తారు. 2025-26 సంవత్సరానికి ముందు ఐదేళ్లలో నాలుగేళ్ల MRRలు, ఒక ఏడాది ACRను పరిగణనలోకి తీసుకుంటారు. 2026-27లో మూడు సంవత్సరాల MRRలు, రెండు సంవత్సరాల ACRలు, 2027-28లో రెండు సంవత్సరాల MRRలు, మూడు సంవత్సరాల ACRలు పరిశీలిస్తారు.
2028-29 ప్యానెల్ ఇయర్‌కు ఒక ఏడాది MRR, నాలుగేళ్ల ACRలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే 2029-30 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం పదోన్నతులకు గత ఐదేళ్ల ACRలనే పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్పుల ద్వారా అధికారుల పనితీరును నిరంతరం సమీక్షించే విధానం బలపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ వర్క్‌షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోనల్ వర్క్‌షాపులు, స్టోర్స్, టైర్ రీట్రేడింగ్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే ఏడాది మొత్తం 16 సెలవులు మంజూరు చేసింది. ట్రాఫిక్, గ్యారేజ్ విభాగాల్లో పనిచేసే వారికి ఐదు సెలవులు ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.