భారత్‌లో స్టార్టప్ రంగం అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. కొత్త ఆలోచనలు, నూతన సాంకేతికత, యువత చొరవతో దేశంలో వేలాది స్టార్టప్‌లు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో 2025 సంవత్సరంలో భారత్ ఒక అరుదైన ఘనతను సాధించింది. స్టార్టప్‌లలోకి వచ్చిన పెట్టుబడుల పరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటింది. గణాంకాల ప్రకారం 2025లో భారత స్టార్టప్ రంగంలో దాదాపు 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి.
అయితే 2024తో పోలిస్తే 2025లో మొత్తం డీల్స్ సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించింది. 2024లో జరిగిన డీల్స్‌తో పోలిస్తే 2025లో దాదాపు 39 శాతం తగ్గి 1,518 డీల్స్‌కే పరిమితమయ్యాయి. అదే విధంగా మొత్తం నిధుల పరిమాణం కూడా సుమారు 17 శాతం తగ్గింది. ముఖ్యంగా సీడ్ స్టేజ్ పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి. 2025లో సీడ్ స్టేజ్ ఫండింగ్ 1.1 బిలియన్ డాలర్లకు మాత్రమే చేరగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 30 శాతం తగ్గుదలగా విశ్లేషకులు చెబుతున్నారు.
చివరి దశ పెట్టుబడులు కూడా 2025లో కొంత మందగించాయి. 2024తో పోలిస్తే 26 శాతం తగ్గి 5.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే ప్రారంభ దశ పెట్టుబడుల్లో మాత్రం స్వల్ప వృద్ధి కనిపించింది. 2025లో ప్రారంభ దశ స్టార్టప్‌లకు 3.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరుగుదలగా గుర్తించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడులు భారీగా వచ్చాయి. 2025లో ఏఐ రంగంలో దాదాపు 100 డీల్స్ జరగగా, ఈ రంగం ద్వారా స్టార్టప్‌లు భారీ నిధులను సమీకరించాయి.
భారత్‌లో మొత్తం స్టార్టప్ ఒప్పందాల్లో సుమారు 30 నుంచి 40 శాతం వరకు ఏఐ రంగానికే సంబంధించినవిగా ఉండటం గమనార్హం. పెరుగుతున్న పట్టణ జనాభా, డిజిటల్ సేవలపై ఆధారపడే జీవనశైలి, వేగవంతమైన సేవల అవసరం వంటి అంశాలు స్టార్టప్ వృద్ధికి తోడ్పడుతున్నాయి. తయారీ, ఫిన్‌టెక్, డీప్‌టెక్ రంగాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య దాదాపు పది రెట్లు పెరగడం దేశ ఆర్థిక భవిష్యత్తుకు శుభ సూచకంగా విశ్లేషకులు భావిస్తున్నారు.