భాగ్యనగర ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జలమండలి (HMWSSB) కీలక అడుగు వేసింది. నగరానికి నిరంతరాయంగా, ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో రూ.8,000 కోట్ల అంచనా వ్యయంతో భారీ వాటర్ సప్లై ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) చుట్టూ వాటర్ రింగ్ మెయిన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) కూడా పూర్తయింది. త్వరలోనే ఈ ప్రతిపాదనను పరిపాలన, ఆర్థిక అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో అమలులో ఉన్న తాగునీటి సరఫరా వ్యవస్థ ఎక్కువగా లీనియర్ పైప్‌లైన్‌లపై ఆధారపడింది. దీంతో ప్రధాన పైప్‌లైన్‌లో ఎక్కడైనా మరమ్మతులు వచ్చినా లేదా సాంకేతిక లోపాలు తలెత్తినా, ఆ మార్గంపై ఆధారపడే లక్షలాది మందికి గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి నీటి సరఫరా నిలిచిపోతోంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ వంటి ప్రాంతాలు అక్కంపల్లి రిజర్వాయర్‌పైనే ఆధారపడటంతో మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందుతోంది. ఈ తరహా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ఈ రింగ్ మెయిన్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. నగర జనాభా కోటిన్నర దాటుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకంగా మారింది.
ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 140 కిలోమీటర్ల పొడవునా ప్రధాన రింగ్ మెయిన్ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. దీనికి అనుబంధంగా, ORR సమీపంలోని అంతర్గత ప్రాంతాలకు నీటిని పంపిణీ చేసేందుకు 98 కిలోమీటర్ల మేర రేడియల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెట్‌వర్క్ ద్వారా హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేస్తున్న ఐదు ప్రధాన వనరులైన గోదావరి, కృష్ణా, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను పరస్పరం అనుసంధానించనున్నారు. ఈ అనుసంధానం వల్ల నగరంలోని ఏ ప్రాంతమూ ఒకే నీటి వనరుపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, సరఫరా వ్యవస్థ మరింత బలపడుతుంది.
ఒక మార్గంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే, వెంటనే మరో మార్గం ద్వారా నీటిని మళ్లించి సరఫరా కొనసాగించే వీలు ఈ రింగ్ మెయిన్ వ్యవస్థ కల్పిస్తుంది. దీనివల్ల మొత్తం నీటి పంపిణీ వ్యవస్థకు భరోసా ఏర్పడుతుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో మంజీరా, ఉస్మాన్‌సాగర్ నీటి సరఫరా నెట్‌వర్క్‌ల ఆధునికీకరణకు రూ.1,000 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ చర్యలతో నీటి నష్టాలు తగ్గి, నాణ్యత కూడా మెరుగుపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్‌కు అనుమతులు లభించిన వెంటనే టెండర్లు, పనులు ప్రారంభించనున్నారు. గోదావరి ఫేజ్–II ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే 2027 నాటికి ఈ రింగ్ మెయిన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.