ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, సేవలు అందించాలనే లక్ష్యంతో కీలకమైన అడుగు వేస్తుంది. కొత్త సంవత్సరం జనవరి 2026 నుంచి పౌరసరఫరాల శాఖకు సంబంధించిన ప్రధాన సేవలన్నీ మనమిత్ర యాప్‌తో పాటు వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో ఇకపై రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజల చేతిలోకి రానున్నాయి.
ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లో 95523 00009 అనే నంబర్‌ను సేవ్ చేసుకుని ‘హాయ్’ అని మెసేజ్ పంపితే సరిపోతుంది. వెంటనే ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివరాలు కనిపించడం జరుగుతుంది . అందులో పౌరసరఫరాల విభాగాన్ని ఎంచుకున్న తర్వాత రేషన్ కార్డు సేవలకు సంబంధించిన ఆప్షన్లు అందుబాటులోకి వస్తుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు, కుటుంబ సభ్యుల చేర్పు లేదా తొలగింపు, చిరునామా మార్పు వంటి మీ ఇంటి వద్దనే చేసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్నారు.
కొత్త రేషన్ కార్డు కోసం అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే దరఖాస్తు నేరుగా సంబంధిత సచివాలయానికి చేరుతుంది. అధికారులు పరిశీలన పూర్తిచేసిన తర్వాత, కొత్త రేషన్ కార్డును పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారు. అలాగే ఇప్పటికే ఉన్న స్మార్ట్ రేషన్ కార్డు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్ కార్డు కోసం కూడా ఈ విధానంలోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగినది. పని నిమిత్తం వలస కారణంగా లేదా ఇతర కారణాలతో కార్డులు అందని వారు కూడా ఈ కొత్త విధానంతో సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
రేషన్ దుకాణాల్లో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రేషన్ షాపులో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వినియోగదారులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సరుకుల పంపిణీలో జరుగుతున్న లోపాలు అక్రమాలు లేదా ఇతర సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించి, తక్షణమే చర్యలు తీసుకునేలా వ్యవస్థను రూపొందిస్తోంది.
ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమాచారం కూడా వాట్సాప్ ద్వారానే తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 73373 59375 అనే నంబర్‌కు ‘హాయ్’ అని పంపితే, ధాన్యం కొనుగోలు షెడ్యూల్, తేదీలు, ఇతర వివరాలు మొబైల్‌లోనే అందుతాయి. రైతులు మరియు వినియోగదారులు ఇద్దరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
పెళ్లి తర్వాత రేషన్ కార్డులో మార్పులు చేయడం కూడా ఇప్పుడు చాలా సులభమైంది. పెళ్లి ధ్రువపత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేస్తే, పాత కార్డు నుంచి పేరు తొలగించడం లేదా కొత్త కార్డులో చేర్చడం త్వరగా పూర్తవుతుంది. ఈ మొత్తం వ్యవస్థతో ప్రభుత్వ కార్యాలయాలపై ఆధారపడటం తగ్గి మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రజలకు నేరుగా సేవలు అందనున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాట్సాప్ ఆధారిత సేవలు రాష్ట్రంలో డిజిటల్ పాలనకు మరో కీలక మైలురాయిగా నిలవనున్నాయి.