ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో రోజురోజుకీ ఏదో ఒక కొత్త టెక్నాలజీ అనేది చూస్తూనే ఉంటున్నాం అయితే ఒకప్పటి రిక్షా నుండి నేటి బుల్లెట్ ట్రైన్స్ వరకు టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి అయితే కాలానికి అనుగుణంగా మనుషులు మార్పు అనేది సహజమే అని చెప్పుకోవడంలో నిస్సందేహం లేదు. దేశవ్యాప్తంగా పట్టణ జీవితం వేగంగా మారుతున్న కొద్దీ ప్రజల ప్రయాణ అవసరాలు కూడా కొత్త రూపం దాలుస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యం, సమయనష్టం వంటి సమస్యలకు పరిష్కారంగా మెట్రో రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి .
ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో మెట్రోపై ఆధారపడుతున్నారు. వేగం, భద్రత, సౌకర్యం కలగలిసిన ప్రయాణాన్ని అందించడం వల్ల మెట్రో వ్యవస్థ నగరాల ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఇటువంటి తరుణంలో భారతదేశంలోనే అతి పొడవైన మెట్రో మార్గం ఢిల్లీ మెట్రోలో ఉండటం విశేషం. ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌లోని పింక్ లైన్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత పొడవైన మెట్రో రూట్‌గా గుర్తింపు పొందింది.
ఈ లైన్ మొత్తం పొడవు 57.49 కిలోమీటర్లు. నగరాన్ని చుట్టుముట్టే విధంగా సెమీ సర్క్యులర్ ఆకారంలో ఈ మార్గం సాగుతుంది. మజ్లిస్ పార్క్ నుంచి ప్రారంభమై బురారీ వరకు విస్తరించిన ఈ లైన్ ఢిల్లీ నగరంలోని అనేక కీలక ప్రాంతాలను అనుసంధానిస్తోంది. గతంలో ఇది శివ్ విహార్ వరకే పరిమితమై ఉండగా తాజాగా బురారీ వరకు పొడిగించారు. పింక్ లైన్‌లో మొత్తం 45 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 38 స్టేషన్లలో రైళ్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. ఈ లైన్ మొత్తాన్ని పూర్తిగా ప్రయాణించాలంటే సుమారు 83 నిమిషాల సమయం పడుతుంది.
మరో విశేషం ఏమిటంటే ప్రయాణికులు ఇతర మెట్రో లైన్లకు సులభంగా మారేందుకు వీలుగా ఇందులో 11 ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే టికెట్‌తో నగరంలోని అనేక ప్రాంతాలకు చేరుకునే అవకాశం లభిస్తోంది. ఇక దేశంలోనే రెండో అతి పొడవైన మెట్రో మార్గం కూడా ఢిల్లీలోనే ఉంది. 56.11 కిలోమీటర్ల పొడవుతో ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వరకు విస్తరించిన ఈ మార్గం రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
మొత్తంగా చూస్తే, భారతదేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ ఢిల్లీ మెట్రోకే ఉంది. అన్ని లైన్లను కలిపి దీని పొడవు సుమారు 350 కిలోమీటర్లు. ప్రతిరోజూ సగటున 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య మరింత పెరిగి 70 నుంచి 80 లక్షల వరకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేగవంతమైన, పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా ఢిల్లీ మెట్రో దేశానికి ఒక ఆదర్శంగా మారనుంది.