ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచే దిశగా ఈ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవసాయ శాఖ మంత్రి జయంత్ చౌదరితో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI)ను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను లోకేశ్ అధికారికంగా వినిపించారు. ఇది రాష్ట్ర యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించడంలో కీలకంగా మారుతుందని ఆయన వివరించారు.
విశాఖ జిల్లా పెదగంట్యాడ ప్రాంతంలో NSTI కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే గుర్తించినట్లు లోకేశ్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంస్థ ఏర్పాటుతో అధ్యాపకుల శిక్షణ, ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్ డెవలప్‌మెంట్, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో విశాఖ ఒక ప్రాంతీయ నైపుణ్య కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండేలా ఈ సంస్థ దోహదపడుతుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCBET) అర్హతలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేయాలని లోకేశ్ కోరారు. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధమవుతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను పరిశ్రమలతో అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా లోకేశ్ తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేశ్‌కు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కూడా లోకేశ్ భేటీ కానున్నారు. విద్య, ఐటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు.