అబ్బనీ తీయనీ దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో అబ్బా! విజయసాయి దెబ్బకు జగన్ విలవిల!
AP Politics: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దసరా నాటికి మూడో ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి, కమ్మలు, క్రిస్టియన్లే రాష్ట్రాన్ని పాలించారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్‌సీపీలోని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యతిరేక వర్గాన్ని, అసంతృప్త రెడ్డి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నిస్తుండటంతో తాడేపల్లి అధిష్టానం అప్రమత్తమై డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది.
- రాయలసీమ రెడ్డి నేతలపై సాయిరెడ్డి గురి.. కొత్త పార్టీ దిశగా వేగంగా పావులు!
- అలర్ట్ అయిన జగన్ క్యాంప్.. అసంతృప్త నాయకులకు స్వయంగా తాడేపల్లి పిలుపులు!
- పరోక్షంగా జగన్‌ను కార్నర్ చేసిన సాయిరెడ్డి.. గత బంధంపై రాజకీయ విశ్లేషణ!
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీసుకుంటున్న తాజా నిర్ణయాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు కొత్త పార్టీని తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఒకవైపు అధికార పార్టీ 'రెడ్ బుక్' రాజకీయం చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ 'రప్ప రప్ప' అంటూ బెదిరింపులకు దిగుతోందని.. ప్రజలు ఈ రెండు పక్షాలకూ ఓటు వేసేందుకు సిద్ధంగా లేరంటూ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా తన పార్టీ పేరును ప్రకటించేందుకు ఆయన సన్నాహాలు ముమ్మరం చేశారు.
వివాదాస్పద 'కమ్మ - క్రిస్టియన్' వ్యాఖ్యల వెనుక మర్మం
రాష్ట్రంలో ఇప్పటివరకు కమ్మవారు, క్రిస్టియన్లే రాజ్యాధికారాన్ని అనుభవించారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రెడ్లు, బీసీలు, కాపులు, ఎస్సీలు, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని, తన పార్టీ ద్వారా ఆయా వర్గాలన్నింటికీ సమన్యాయం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని, వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పరోక్షంగా ఉద్దేశించే ఆయన 'క్రిస్టియన్ అధికారం' అనే ప్రస్తావన తెచ్చారని, తద్వారా హిందూత్వ వాదానికి, రెడ్డి సామాజిక వర్గానికి దగ్గరయ్యే వ్యూహాన్ని రచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత బంధాలు, ప్రవర్తనపై విశ్లేషకుల ప్రశ్నలు
విజయసాయిరెడ్డి ప్రకటనపై సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కల్లూరి తన 'రాజనీతి' విశ్లేషణలో పలు ఆసక్తికర ప్రశ్నలను లేవనెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి ఎందరో రెడ్డి ప్రముఖులు ముఖ్యమంత్రులుగా సేవలందించారని గుర్తుచేశారు. అంతేకాకుండా, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్ రెడ్డిలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, వారి కోసం జైలు జీవితం సైతం గడిపిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు వారినే పరోక్షంగా విమర్శించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సజ్జల వైఖరితో విసిగిపోయిన అసంతృప్తులకు గాలం
వైఎస్సార్‌సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ, గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలోనూ, ప్రస్తుత ప్రతిపక్షంలోనూ నష్టపోయిన నాయకుల జాబితాను విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 'సజ్జల ఉన్నంత కాలం మీకు వైసీపీలో గుర్తింపు దక్కదు.. నాతో కలిసి రండి, మీ భవిష్యత్తుకు నాది భరోసా' అంటూ అసంతృప్త నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోని కీలక సామాజిక వర్గ నాయకులతో ఆయన ఇప్పటికే రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాడేపల్లి ప్యాలెస్‌లో తీవ్ర అలజడి – డ్యామేజ్ కంట్రోల్
సాయిరెడ్డి దూకుడుతో వైసీపీ అధిష్టానం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కీలక నేతలు చేజారకుండా ఉండేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం ముమ్మరంగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. గత ఐదేళ్లుగా అపాయింట్‌మెంట్ కూడా దక్కని ద్వితీయ శ్రేణి, అసంతృప్త నాయకులను సైతం స్వయంగా పిలిపించుకుని మాట్లాడే ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావని, నాయకుల ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరిస్తామని స్వయంగా హామీలు ఇస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
బొత్సతో జగన్ చర్చలు – మారుతున్న అంతర్గత సమీకరణాలు
గత కొంతకాలంగా పార్టీ పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో కూడా వైఎస్ జగన్ స్వయంగా మాట్లాడినట్లు సమాచారం. చిన్న శ్రీను పార్టీ మారిన తరుణంలో బొత్సపై ఉన్న అపోహలను పక్కనపెట్టి, ఆయనతో సమాలోచనలు జరపడం వెనుక విజయసాయిరెడ్డి తెచ్చిన ఒత్తిడే కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాయిరెడ్డి రంగప్రవేశం ఏపీ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందనేది పక్కనపెడితే.. ఆయన చర్యలు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాల్లో పెను భూకంపం సృష్టిస్తున్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది.
Tags
Be the first to react