యూపీఐ అంటే ఇప్పుడు కేవలం ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ మాత్రమే కాదు, అది కోట్లాది భారతీయుల రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు, టీ కొట్టు నుంచి టెక్ స్టోర్ల వరకు ప్రతిచోటా యూపీఐ వినియోగం నేటి యుగంలో కనిపిస్తూనే ఉంది. జేబులో నగదు లేకపోయినా, ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే చాలు అనే స్థాయికి మనం చేరుకున్నాం. అయితే ఇంత సులభంగా, ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ సేవల భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది.
ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితం అన్న భావన అందరిలో ఉంది. కానీ వాస్తవానికి ప్రతి ట్రాన్సాక్షన్ వెనుక భారీ ఖర్చు జరుగుతోంది. ఒక్కో లావాదేవీని సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు సైబర్ సెక్యూరిటీ, సర్వర్లు, టెక్నాలజీ నిర్వహణ వంటి అంశాలపై డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒక్క ట్రాన్సాక్షన్‌కు సగటున రూ.2 వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం ఈ భారాన్ని ఎక్కువగా బ్యాంకులు మరియు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాయి.
యూపీఐ లావాదేవీలపై ప్రస్తుతం జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలులో ఉంది. అంటే వ్యాపారులు యూపీఐ వినియోగానికి ఎలాంటి ఫీజు చెల్లించడం లేదు. దీని వల్ల చిన్న వ్యాపారులకు, సాధారణ ప్రజలకు ఎంతో లాభం జరిగింది. కానీ మరోవైపు బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు సంస్థలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గతంలో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చేది. అయితే కాలక్రమేణా ఈ సబ్సిడీలు గణనీయంగా తగ్గాయి.
ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను సమర్థవంతంగా, సురక్షితంగా నడపాలంటే ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించడం, మోసాలు, హ్యాకింగ్‌ల నుంచి వినియోగదారులను రక్షించడం వంటి అంశాలు పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో 2026 బడ్జెట్‌లో యూపీఐపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
సాధారణ ప్రజలపై భారం పడకుండా వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద కార్పొరేట్ సంస్థలు, భారీ టర్నోవర్ కలిగిన వ్యాపారాలపై మాత్రమే నామమాత్రపు ఫీజులు విధించే ఆలోచన ఒకటి. మరోవైపు యూపీఐ కోసం మళ్లీ సబ్సిడీలను పెంచాలన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా, అది డిజిటల్ ఇండియా భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.
యూపీఐ భారతదేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యవస్థ. ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ఆర్థికంగా అది బలంగా ఉండాలి. ఉచిత సేవల వెనుక ఉన్న వాస్తవాలను అర్థం చేసుకుని, సామాన్యుడికి భారం పడకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అసలైన సవాల్.