ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్టేడియం సమగ్ర అభివృద్ధి కోసం రూ.2.37 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనల మేరకు ఈ నిధులను కేటాయించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ నిధులతో ఒంగోలులో క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.
ఈ నిధుల వినియోగంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి మినీ స్టేడియంలో ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. బాక్సింగ్ రింగ్, ఖోఖో గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ వంటి వసతులను ఏర్పాటు చేయనున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, స్థానిక ప్రతిభను వెలికి తీయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని శాప్ చైర్మన్ వివరించారు.
స్టేడియం అభివృద్ధితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా క్రీడా మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు. రంగారాయుడు చెరువుకట్టపై వాకింగ్ ట్రాక్, డీఆర్‌ఆర్‌ఎం పాఠశాలలో ఫుట్‌బాల్ గ్రౌండ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో వాలీబాల్ కోర్టు, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ కింద షటిల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులు రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో క్రీడారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని రవి నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వల్ల ప్రతిభకు నష్టం జరిగిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని ‘క్రీడా ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దే దిశగా ముందడుగులు వేస్తోందని శాప్ చైర్మన్ తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.2.25 కోట్ల నిధులతో దర్శి, అద్దంకి, వైపాలెం ప్రాంతాల్లో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్యలతో జిల్లాలో క్రీడా సంస్కృతి బలోపేతమై, భవిష్యత్ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.