అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్థాన్, మరోసారి తన పాత పాటను అందుకుంది. ఫిబ్రవరి 5వ తేదీని 'కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం'గా జరుపుకుంటున్న ఆ దేశం, ఈ సందర్భంగా భారత్‌పై తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్ పట్ల విషం చిమ్ముతూ, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) వేదికగా ప్రసంగించిన షెహబాజ్ షరీఫ్, కాశ్మీర్ తమ దేశంలో అంతర్భాగం అవుతుందంటూ ఆవాకులు చవాకులు పేలారు. కాశ్మీర్ అనేది పాకిస్థాన్‌కు జీవనాడి. మహమ్మద్ అలీ జిన్నా ఆనాడే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మా విదేశాంగ విధానంలో కాశ్మీర్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, కాశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనడం అసాధ్యమని, ఈ ప్రాంతంలో అస్థిరతకు భారత్ కారణమని అడ్డగోలు ఆరోపణలు చేశారు.
భారత సైన్యం చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ, వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ గిలానీ వంటి వ్యక్తులను పాక్ ప్రధాని కీర్తించడం చర్చనీయాంశంగా మారింది. భారత్‌ను ఉగ్రవాద దేశంగా చిత్రించేందుకు ప్రయత్నిస్తూనే, తన దేశం నుంచి సాగుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఆయన పూర్తిగా విస్మరించారు.
పాక్ ప్రధానికి మద్దతుగా ఆ దేశ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ కూడా రంగంలోకి దిగారు. కాశ్మీరీలకు తాము రాజకీయంగా, దౌత్యపరంగా మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. అయితే, పాకిస్థాన్ నేతల ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, పాక్ తన అధీనంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్‌ను త్వరగా ఖాళీ చేయాలని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం పాకిస్థాన్ ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం మరియు రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు 'కాశ్మీర్' కార్డును వాడుకోవడం పాక్ పాలకులకు అలవాటుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పాక్ ప్రయత్నాలు ఎప్పటిలాగే విఫలమవుతాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి