తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు పొందిన కుటుంబాలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ మరియు ‘మహాలక్ష్మి’ పథకాల లబ్ధిదారుల జాబితాలో తాజా రేషన్ కార్డు దారులను కూడా చేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఈ పథకాలకు రేషన్ కార్డు ఉండటం తప్పనిసరిగా ఉండేది. దీంతో చాలా కుటుంబాలు వీటి లబ్ధి నుండి నిష్క్రమించబడ్డాయి. కానీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందినవారికి కూడా ఈ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు ఇప్పటికే మహాలక్ష్మి (రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్) మరియు గృహజ్యోతి (ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్) పథకాల కోసం కొత్త రేషన్ కార్డు హోల్డర్స్ నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లబ్ధిదారులు తమ సమీప ఎంపీడీవో లేదా మునిసిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలను సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ కార్డు జిరాక్స్‌లు, విద్యుత్ బిల్లులు, గ్యాస్ రసీదు, వినియోగదారు నంబర్ వంటి పత్రాలు అవసరం. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే జరుగుతోందా, లేక రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నదా అనే విషయంపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.ఈ నిర్ణయం వేలాది కొత్త రేషన్ కార్డు హోల్డర్లకు ఉపశమనం కలిగించనుంది.