ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు, బైపాస్ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో కాకినాడ నగరంలో తీవ్రంగా మారిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉప్పుటేరుపై మూడో వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటిమొగ వద్ద ఉప్పుటేరుపై వంతెన, బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన జరిగినప్పటికీ, ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది.
స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి కాకినాడ ట్రాఫిక్ సమస్య తీవ్రతను వివరించడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ నిధుల మార్గాలను అన్వేషించిన ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు బాధ్యతలను జాతీయ రహదారుల విభాగానికి అప్పగించాలని నిర్ణయించింది. ఉప్పుటేరుపై మూడో వంతెనతో పాటు సుమారు 3 కిలోమీటర్ల పొడవైన బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.300 కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందించారు. ఈ డీపీఆర్‌ను జాతీయ రహదారుల విభాగానికి సమర్పించగా, వారు ఇప్పటికే ఒక కన్సల్టెన్సీని నియమించి సాంకేతిక అధ్యయనం ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ నగరానికి ఇది గేమ్ చేంజర్‌గా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం విశాఖపట్నం, అమలాపురం, రావులపాలెం వంటి ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు కాకినాడ నగరంలోంచే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులపై రోజూ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు, కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి చొల్లంగి వరకు 216 జాతీయ రహదారిలో భాగంగా 18.4 కిలోమీటర్ల పొడవైన బైపాస్ రోడ్డును గతంలో ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు మొదలై దశాబ్దం గడిచినా ఇంకా పూర్తి కాకపోవడం గమనార్హం. దీనివల్ల ఆశించిన ఫలితం రాలేదు.
ఇప్పుడు ఈ బైపాస్‌కు తోడుగా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాకినాడ పోర్టు నుంచి ఉప్పుటేరు మీదుగా కొత్త వంతెన నిర్మించి, అక్కడి నుంచి చొల్లంగి వద్ద 216 జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ రెండు బైపాస్‌లు పూర్తయితే, భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, నగరవాసులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారి నిర్మాణం ఇప్పటికే చివరి దశకు చేరుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్టు కూడా వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.