రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు నుంచి భారీ పెట్టుబడుల ఆకర్షణ వరకు తమ ప్రభుత్వ పాలన దార్శనికతను ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకొచ్చే విధానాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన సీఎం, గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలు, అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ క్యాంటీన్లను రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టిందని విమర్శించారు. సంక్షేమం అంటే కేవలం నినాదాలు కాదు, పేదవాడికి నేరుగా ఉపయోగపడే విధంగా ఉండాలని స్పష్టం చేశారు.
గత పాలనలో జరిగిన భూ అక్రమాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిపాడ్ కోసం ఒక ప్రైవేట్ భూమిని అక్రమంగా 22-ఏ నిబంధన కింద చేర్చారని, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ తరహా అక్రమాలు తాడేపల్లికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయని తెలిపారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో పకడ్బందీ భూసర్వే ప్రక్రియను ప్రారంభించామని, క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో కూడిన రాజముద్ర గల పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా పారదర్శక పాలన అమలు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి నిర్దేశించుకున్న దీర్ఘకాల లక్ష్యాలను కూడా ముఖ్యమంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేయడం వల్ల ఇప్పుడు దాని పునర్నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్లు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ విమర్శించిన వారే ఇప్పుడు దాని అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. వచ్చే మూడేళ్లలో అమరావతిని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా (మోస్ట్ లివబుల్ సిటీ) తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక ప్రగతిపై మాట్లాడుతూ మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు, 5,757 కానిస్టేబుల్ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని తెలిపారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారబోతోందన్నారు. అధికారులు అందరూ టీమ్ స్పిరిట్‌తో పనిచేసి పాలన ప్రజలకు వేగంగా అందేలా చూడాలని (స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్) పిలుపునిచ్చారు. రైతులకు మార్కెట్ జోక్యం, ధాన్యం కొనుగోళ్లకు తక్షణ చెల్లింపులు, రోడ్ల నిర్మాణం, ఇంటింటికీ కుళాయి, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు. 2026–27 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు తప్పకుండా సాధించేలా కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు.